వెంటపడవద్దంది... కాల్చి చంపేశారు!
posted on Feb 23, 2016 4:27PM

ఉత్తర్‌ప్రదేశ్‌లో సాగుతున్న దారుణాలకి అంతులేకుండా పోతోంది. అందుకు తాజా ఉదాహరణగా ఇద్దరు అక్కాచెల్లెల్ల మీద నడిరోడ్డు మీద కాల్పులు జరిపారు దుండగులు. స్థానికుల కథనం ప్రకారం ప్రింకీ అనే 15 ఏళ్ల అమ్మాయిని రోజూ ఇద్దరు కుర్రవాళ్లు వేధిస్తూ ఉండేవారు. వాళ్ల ఆగడాలు తట్టుకోలేక ప్రింకీ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయింది. సోమవారం రాత్రి ఎప్పటిలాగే పని ముగించుకుని వస్తున్న ప్రింకీని వారు వేధించడం మొదలుపెట్టారు. అసభ్యకరమైన వారి మాటలు విని తట్టుకోలేకపోయిన ప్రింకీ, ఇక మీదట తన జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ వారిని తీవ్రంగా మందలించింది. దాంతో వారిలోని కుల్‌దీప్ అనే యువకుడు, అక్కడికక్కడే ఆమెను కాల్చి చంపేశాడు. ఈ సమయంలో ప్రింకీ పక్కనే ఉన్న ఆమె అక్కయ్యకు కూడా తీవ్రమైన గాయాలు అయ్యాయి. 2012లో నిర్భయ ఉదంతం జరిగిన తరువాత ప్రభుత్వాలన్నీ, తాము ఆకతాయిల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నామంటూ పేర్కొంటున్నాయి. కానీ అది అబద్ధమని తెలియచేసేలా ఇలాంటి వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.