ఐపీఎస్ ఆఫీసర్ మీద గర్ల్ఫ్రెండ్ కంప్లయింట్
Published on: Wed Sep 24, 2014 2:15PM

తమిళనాడుకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ మీద ఆయన గర్ల్ ఫ్రెండ్ పోలీసు అధికారులకు, కోర్టుకు ఫిర్యాదు చేసింది. తిరుచ్చికి చెందిన ఐపీఎస్ అధికారి వరుణ్కుమార్ చెన్నైకి చెందిన రిటైర్డ్ పోలీస్ కమిషనర్ కుమార్తెని ప్రేమించాడు. అయితే కొంతకాలం తర్వాత వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. తనను పెళ్ళి చేసుకోవాలంటే భారీ స్థాయిలో కట్న కానుకలు వరుణ్ కుమార్ కోరాడని ఆమె చెన్నై పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి, చర్యలు తీసుకోవాలని ఆదేశించాలని కోరుతూ ఆమె తమిళనాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పరిశీలించిన హైకోర్టు దీనిపై పరిశీలనకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో పోలీసులు వరుణ్కుమార్ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. వరుణ్ కుమార్ ప్రస్తుతం బెయిల్ మీద విడుదలయ్యాడు.


