ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూత

 

ప్రముఖ సినీ, రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత గిరీశ్ కర్నాడ్(81) ఈ రోజు ఉదయం 6.30కి తుదిశ్వాస విడిచారు.  గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో తన స్వగృహంలో కన్నుమూశారు. గిరీష్ కర్నాడ్ 1938 మే 19 మహారాష్ట్రలోని మాథేరాన్ ప్రాంతంలో జన్మించారు. ఆయన కన్నడ భాషలో ఎన్నో గొప్ప రచనలు చేశారు. 

సాహిత్య రంగంలో ఆయన అందించన సేవలకు గాను 1998లో సాహిత్య అకాడమీ వాళ్లు జ్ఞానపీఠ్ అవార్డును ప్రధానం చేశారు, భారత ప్రభుత్వం 1974లో పద్మశ్రీ, 1992లో పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది. సినిమారంగంలో ఆయన 7 ఫిలింఫేర్ అవార్డులు, 10 జాతీయ అవార్డులు అందుకున్నారు. 

ఆయన తెలుగు, తమిళం, మళయాలం చిత్రాలతో పాటు అనేక హిందీ చిత్రాల్లో నటించారు. 1970లో ‘సంస్కారా’ అనే చిత్రం ద్వారా ఆయన సినిమాల్లో అరంగేట్రం చేశారు. జంధ్యాల దర్శకత్వంలో 1983లో తెరకెక్కిన ఆనందభైరవి చిత్రంతో కర్నాడ్‌కు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. బుల్లితెరపై సంచలన విజయం సాధించిన ‘మాల్గుడి డేస్’ అనే సీరియల్‌లోనూ ఆయన నటించారు. చివరిగా అప్నా దేశ్ అనే కన్నడ సినిమాలో ఆయన నటించారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 26న విడుదలకానుంది. 

గిరీశ్ కర్నాడ్ మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. గిరీష్ కర్నాడ్ అంత్యక్రియలు సోమవారం బెంగళూరులో నిర్వహించబోతున్నారు. ఆయన చివరి కోరిక మేరకు ఎలాంటి అధికారిక లాంఛనాలు లేకుండా అంత్యక్రియలను చేయాలనుకుంటున్నామని కుటుంబసభ్యులు తెలిపారు. అలాగే తమకు కాస్త ప్రైవసీ కావాలన్న గిరీష్ భార్య, కుమారుడు.. రాజకీయ నాయకులు, ప్రముఖులు కొద్ది రోజులు తమ ఇంటికి రావొద్దంటూ విఙ్ఞప్తి చేశారు.

గిరీష్ కర్నాడ్ మృతి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మూడు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. అలాగే పాఠశాలలు, కాలేజీలకు ఒక రోజు సెలవును ప్రకటించింది.