పేలిన పెళ్లికానుక.. పెళ్లికొడుకు దుర్మరణం

పెళ్లిలో వధూవరులను అభినందిస్తూ బంధువులు, సన్నిహితులు కానుకలు సమర్పించడం కామన్. అయితే తమకు ఎంతటి అపురూపమైన కానుక వచ్చిందోనని ఆతృతగా దానిని తెరిచిన ఓ పెళ్లికుమారుడు దుర్మరణం పాలయ్యాడు. అదేంటి గిఫ్ట్ కవర్ ఓపెన్ చేస్తే చనిపోవడమేంటీ అనుకుంటున్నారా..? ఒడిషాలోని బొలాంగిర్ జిల్లాలో ఐదురోజుల క్రితం ఓ వివాహ రిసెప్షన్ జరిగింది. ఈ జంటను దీవిస్తూ బోలెడన్ని కానుకలు వచ్చాయి. రిసెప్షన్ ముగిసిన తర్వాత గిఫ్ట్ బాక్స్‌లను ఓపెన్ చేస్తుండగా.. ఒక కవర్‌ను తెరిచి చూడగా.. అది వెంటనే పేలింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న పెళ్లికుమారుడు.. అతని బామ్మ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వీరిద్దరూ కన్నుమూశారు. తీవ్ర గాయాలపాలైన వధువు బుర్లా ప్రభుత్వాసుపత్రిలో ప్రాణాలతో పోరాటం చేస్తోంది. సంచలనం సృష్టించిన ఈఘటనలో అసలు ఆ పెళ్లికానుక ఇచ్చిన వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.