గ్రేటర్ లో పెద్ద నేతలకు షాక్! కలిసిరాని అమిత్ షా రోడ్ షో

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఎవరూ ఊహించని అద్భుతాలు జరిగాయి. ఎల్బీనగర్ జోన్ లో కమలం ప్రభంజనం వీచింది. 2016 ఎన్నికల్లో ఇక్కడ కారు పార్టీ క్లీన్ స్వీప్ చేయగా.. ఈసారి సీన్ రివర్స్ అయింది. 11కు 11 డివిజన్లు కమలం గెలుచుకుంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో విజయం సాధించారు బీజేపీ అభ్యర్థులు.మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి సీరియస్ గా పని చేసినా కమలం గాలి ముందు వారి పప్పులు ఉడకలేదు. మంత్రి సబితా ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు డివిజన్లలో బీజేపీనే గెలిచింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంచార్జి గా ఉన్న అడిక్ మెట్, మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంచార్జ్ గా ఉన్న సరూర్ నగర్ లో టీఆరెస్ ఓటమి పోయింది. 

 

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు షాక్ తగిలింది. ముషిరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ ను ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ నుంచి ప్రచారం ముగిసేవరకు అంతా కవిత డైరెక్షన్ లోనే జరిగింది. దాదాపు వారం రోజుల పాటు గాంధీనగర్ డివిజన్ లో గల్లిగల్లీ తిరిగి ప్రచారం చేశారు కవిత. వివిధ కులసంఘాలు, కాలనీ అసొసియేషన్లతోనూ సమావేశాలు నిర్వహించారు. అయినా గాంధీనగర్ లో బీజేపీ విజయం సాధించడం కవితకు పెద్ద షాకే అంటున్నారు. దివంగత హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి రామ్ నగర్ లో ఓటమి పాలయ్యారు.

 

కేంద్ర సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీకి అనుకున్నంత స్థాయిలో  విజయాలు సాధించలేదు. ఎల్బీనగర్ లో స్వీప్ చేసిన కమలం.. కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం అంబర్ పేటలో మాత్రం రెండు డివిజన్లు మాత్రమే గెలిచింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ప్రతిష్టాత్మకమైన డివిజన్ మోండా మార్కెట్‌లో బీజేపీ విజయం సాధించింది.  గతంలో మోండా మార్కెట్ డివిజన్ నుంచి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు కార్పొరేటర్‌లుగా పోటీ చేశారు. మోండా మార్కెట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల రూపపై  బీజేపీ అభ్యర్థి  దీపిక ఘన విజయం సాధించారు.ఉప్పల్ ఎమ్మెల్యేకు ఓటర్లు షాకిచ్చారు. హబ్సిగూడ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి భార్యపై బీజేపీ అభ్యర్థి చేతన సంచలన విజయం సాధించింది.  

 

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రోడ్ షోలు బీజేపీకి కలిసి రాలేదు. అమిత్ షా రోడ్ షో నిర్వహించిన ప్రాంతాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. వారసిగూడ నుండి సీతాఫల్ మండి వరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రోడ్ షో చేశారు. ఆ పరిధిలోని అడ్డగుట్ట నుంచి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లింగాన ప్రసన్న లక్మి 6 863 ఓట్ల మెజార్టీ తో విజయం సాధించారు .సీతాఫల్ మండిలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సామల హేమ విజయం సాధించారు.

 

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్ రెడ్డి డివిజన్ లో మరో వింత జరిగింది. ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. మొదటి నుంచి టీఆరెస్ అభ్యర్థి లక్ష్మీప్రసన్న లీడ్ లో ఉండగా.. చివరికి మాత్రం 32 ఓట్లతో బీజేపీ అభ్యర్థి గెలిచాడు. ఇదే డివిజన్ లో ఇండిపెండెంట్ డమ్మీ అభ్యర్థిగా టీఆరెస్ అభ్యర్థి లక్ష్మీప్రసన్న కుమారుడు ముదగౌని రంజిత్ గౌడ్ పోటీ చేశాడు. అతనికి 37 ఓట్లు పోలయ్యాయి. తల్లి 32 ఓట్లతో ఓడిపోగా.. కుమారుడికి 37 ఓట్లు పోల్ కావడం చర్చగా మారింది. కొడుకు పోటీ చేయడం వల్లే తల్లి ఓడిపోయిందనే చర్చ జరుగుతోంది.