TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై జీహెచ్‌ఎంసీ అధికారుల దాడి

Published on: Fri Jun 12, 2026 2:38PM

 

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీశైలంపై జీహెచ్‌ఎంసీ అధికారుల దాడి ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాల ప్రకారం, జీహెచ్‌ఎంసీకి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), ఏఎంఓహెచ్‌ అసిస్టెంట్ ప్రయాణిస్తున్న కారు రాంగ్‌రూట్‌లో వస్తుండటాన్ని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీశైలం వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన అధికారులు కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగారు.

రాంగ్‌రూట్‌లో ప్రయాణించడంపై ప్రశ్నించిన కానిస్టేబుల్‌పై జీహెచ్‌ఎంసీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాగ్వాదం క్రమంగా ఉద్రిక్తంగా మారడంతో కానిస్టేబుల్‌పై దుర్భాషలాడటమే కాకుండా భౌతిక దాడికి కూడా పాల్పడినట్లు వీడియోల్లో కనిపిస్తోంది.

నిబంధనలకు విరుద్ధంగా రాంగ్‌రూట్‌లో వచ్చారని కానిస్టేబుల్ శ్రీశైలం పలుమార్లు చెప్పినా, వారు పట్టించుకోకుండా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఘటనను వీడియో తీస్తున్నావంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నానాహంగామా సృష్టించినట్లు సమాచారం.

ఈ ఘటనతో కొంతసేపు రోడ్డుపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల సమక్షంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందిపై దాడి జరగడం పోలీసు వర్గాల్లో ఆందోళనకు దారితీసింది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి దారితీసిన పరిస్థితులు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.