TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

గ్రేటర్ మేయర్ బరిలో ఎంఐఎం! టీఆర్ఎస్ కు బీజేపీ సపోర్టు చేసేనా?

Published on: Tue Feb 9, 2021 9:41AM

గ్రేటర్ కొత్త మేయర్  ఎవరు? కేసీఆర్ వ్యూహమేంటీ ? ఫిబ్రవరి 11న జరిగే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. గ్రేటర్ ఎన్నికల్లో హంగ్ ఫలితాలు వచ్చాయి. ఎవరూ మేయర్ కావాలన్న మరో పార్టీ మద్దతు తీసుకోవాల్సిందే. అయితే పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరిగినట్లు కనిపించలేదు. దీంతో గ్రేటర్ మేయర్ ఎన్నిక జరుగుతుందా లేదా అన్న సందేహం కల్గింది. అయితే  ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ  సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా టీఆర్ఎస్ అభ్యర్థే ఉంటారని చెప్పారు కేసీఆర్. అభ్యర్థి పేరు ప్రకటించ లేదు.. కానీ సీల్డ్ కవర్ లో అభ్యర్థి పేరు ఉంటుందని తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లు సీల్డ్ కవర్ ద్వారా కార్పొరేటర్లకు అందిస్తామని, కార్పొరేటర్లు వాటిని జీహెచ్ఎంసీలోనే తెరిచి పార్టీ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేయాలని గులాబీ బాస్ సూచించారు. 
 

గ్రేటర్ మేయర్ ఎన్నికపై  కేసీఆర్ చేసిన తాజా ప్రకటన  కొత్త చర్చకు దారి తీసింది. గ్రేటర్ లో సింగిల్ గా మేయర్ గెలిచే అవకాశం లేకున్నా టీఆర్ఎస్ అభ్యర్థే ఉంటారని కేసీఆర్ చెప్పడంతో... టీఆర్ఎస్ ఎవరూ సపోర్ట్ తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉండగా అధికార టీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ రెండు డివిజన్లు గెలుచుకుంది. లింగోజిగూడ నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి చనిపోవడంతో ఇప్పుడు 149 మంది సభ్యులే ఓటింగులో పాల్గొనన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం టీఆర్ఎస్ కు కనీసం 33  మంది ఎంఐఎంకు 10 మంది బీజేపీకి ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. ఈ లెక్కన మేయర్ ఎన్నికల్లో ఓటు వేసే మొత్తం సభ్యుల సంఖ్య 194గా ఉంది. ఈ లెక్కన మేయర్ కావాలంటే మేజిక్ ఫిగర్ 97. 

ఎక్స్ అఫిషియో సభ్యులతో కలుపుకున్నా టీఆర్ఎస్ బలం 89గానే ఉంది. ఆ పార్టీకి ఇంకా 8 మంది సభ్యుల మద్దతు కావాలి. 8 మంది ఎక్కడినుంచి వస్తారన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు సంబంధించి మజ్లిస్‌ పార్టీ పాత్ర కీలకంగా మారింది. అయితే టీఆర్ఎస్ కు ఎంఐఎం మిత్రపక్షంగానే ఉన్నా.. గ్రేటర్ ఎన్నికల్లో ఇరు పక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. అంతేకాదు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎంఐఎం మద్దకు తీసుకునే సాహసం కారు పార్టీ చేయకపోవచ్చంటున్నారు. ఎంఐఎం సపోర్ట్ తీసుకుంటే... ఇదే అస్త్రంగా బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా దూకుడు పెంచే అవకాశం ఉందని గులాబీ నేతలు భయపడుతున్నారట. అందుకే ఎంఐఎం మద్దతు లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కించుకునేందుకు అధికార పార్టీ కొత్త ఎత్తులు వేస్తుందని చెబుతున్నారు.

గ్రేటర్ మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం కూడా పోటీ చేసేలా టీఆర్ఎస్ ప్లాన్ చేసిందని చెబుతున్నారు. దీంతో మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్లు టీఆర్ఎస్ కు.. పతంగి పార్టీ కార్పొరేటర్లు అభ్యర్థికి ఓటేస్తారు. ఈ లెక్కన ఎంఐఎంకు 54 ఓట్లు రానుండగా.. టీఆర్ఎస్ కు 89 ఓట్లు వస్తాయి. దీంతో టీఆర్ఎసే మేయర్, డిప్యూటి మేయర్ సీట్లను కైవసం చేసుకోనుంది. దీంతో ఎంఐఎం సపోర్ట్ తీసుకోలేదని చెప్పుకోవడంతో పాటు మేయర్ పీఠం గెలుచుకోవడం రెండు అధికార పార్టీకి ప్లస్ కానున్నాయి. 

మరోవైపు మేయర్ అభ్యర్థి విషయంలో బీసీ, రెడ్డి సామాజికవర్గాల మధ్య పోటీ ఉండే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీసీ కేటగిరిలో టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే కూతురు విజయలక్ష్మి, ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి  రేసులో ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం విషయంలో చూస్తే పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, మన్నె గోవర్థన్ రెడ్డి సతీమణి కవిత, మాజీ ఎమ్మెల్యే కనకా రెడ్డి కోడలు విజయశాంతి ఆశలు పెట్టుకున్నారు. సీల్డ్ కవర్ లో అభ్యర్థి పేరు రానుండటంతో బల్దియా మేయర్ ఎవరనే విషయం గురువారం రోజే తేలబోతోంది.