పోలింగ్‌ 45 శాతమే… కానీ ఎందుకు?

 

నెలరోజులుగా సందడిసందడిగా సాగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల క్రతువు ముగిసింది. 2009లో జరిగిన స్థానిక ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం కాస్త మెరుగుపడిందంటూ ఎన్నికల అధికారులు మురిసిపోయారు. కానీ తామ ఆశించినంతగా పోలింగ్‌ జరగలేదని ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి సైతం ఒప్పుకోక తప్పలేదు. ఓటు వేసేందుకు తరలిరమ్మంటూ నగర వాసులను ఎంతగా వేడుకున్నా వారు ముందుకు రాలేదని ఆవేదన చెందారు ఆయన. నగరవాసులో ఈ జడత్వం సాధారణమేననీ ఇందుకోసం మరింత కృషి చేయాల్సి ఉంటుందనీ జనార్దన్‌రెడ్డి అంటున్నారు. నిజంగానే నగరవాసులలోని జడత్వం వల్ల ఇంత దారుణమైన పోలింగ్‌ శాతాలు నమోదయ్యాయా. మరైతే విద్యావంతులు తక్కువగా ఉండే చోట కూడా 20 శాతం కంటే ఓట్లు ఎందుకు నమోదైనట్లు! పోలింగ్‌ ఇంత తక్కవగా నమోదవడానికి కారణం ఒకటో రెండో కాదు…. వెతికితే చాలా కారణాలే వెక్కిరిస్తున్నాయి. - ఎన్నికల నగారా మోగినప్పటి నుంచీ తెరాస గ్రేటర్‌ పీఠాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

 

ఎలాగైనా నెగ్గితీరాలనుకుంటూ దూకుడుగా ముందుకు సాగిపోయింది. ప్రచారంలో ఒకో రోజూ గడిచేకొద్దీ తెరాస వేగానికి అల్లంత దూరంలో మిగతా పార్టీలు నిలిచిపోయాయి. ఓటర్లు సైతం ఈ ఎన్నికలలో తెరాస తప్ప మరో పార్టీ రాదన్న అవగాహనకు వచ్చేశారు. తాము ఓటు వేసినా వేయకున్నా అధికార పార్టీదే మేయర్‌ పీఠం అన్న అభిప్రాయంతో ఉన్నారు. పోలింగ్‌ శాతం తగ్గడం వల్ల కొన్ని ప్రాంతాలలోనే బలంగా ఉండే మజ్లిస్‌ వంటి ప్రతిపక్షాలు నష్టపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. - ఎన్నికల కమిషన్‌ ఎంతగా మొత్తుకున్నా, ఓటు వేయమంటూ ఎంతమంది ప్రముఖులు అభ్యర్థించినా విద్యావంతులు ఎప్పటిలాగానే పోలింగ్‌కు దూరంగా ఉండిపోయారు. ఏ ప్రభుత్వం వస్తే తమకేం ఒరుగుతుందనే నిరాశ ఒకవైపు, రాజకీయాలంటే ఉన్న నిరాసక్తత మరోవైపు వారిలో జడత్వాన్ని బలపరిచాయి. - పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ చాలా సంస్థలు వాటిని అమలుపరచలేదు. ఐటీ ఉద్యోగులు నేరుగా వెళ్లి ఎన్నికల కమీషన్‌ను సంప్రదించినా లాభం లేకపోయింది. పోలింగ్‌ రోజున చాలా చాలా సంస్థలు యథావిధిగానే పనిచేశాయి. - ఎన్నికలకు ముందు పోలింగ్‌ డివిజన్లను ఇష్టారాజ్యంగా చీల్చడంతో తమ ఓటు ఎక్కడ ఉందో తెలియని గందరగోళం కొందరు ఓటర్లలో నెలకొంది. తాము ఒకచోట నివసిస్తుంటే ఓటు మరెక్కడో ఉండటంతో మరికొందరు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. - ఓట్లు వేసేందుకు కదలి రమ్మంటూ ఎన్నికల కమిషన్‌ తెగ ఊదరగొట్టింది. కానీ ఓటు హక్కును కల్పించేందుకు అందులో నాలుగో వంతు ప్రయత్నం చేసినట్లు కూడా కనిపించలేదు. ఫలితం వేలాది ఓట్లు గల్లంతైపోయాయి.

 

పైగా ఇంటింటికీ తిరిగి కొత్త ఓటర్లను నమోదు చేయడంలో కానీ, ఓటరుగా నమోదు చేసుకునేందుకు అందిన రాతపూర్వక దరఖాస్తులను పరిశీలించడంలో కానీ ఎన్నికల కమిషన్‌ ‘జడత్వాన్ని’ ప్రదర్శించిందన్న ఆరోపణలు ఉన్నాయి. అన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులకి మాత్రం సత్వర పరిష్కారం లభించింది. - ఓటర్లకు సంబంధించి దాదాపు 90 శాతం ఓటరు స్లిప్‌లను పంపిణీ చేశామని ఎన్నికల కమిషన్‌ చెబుతోంది. కానీ వాస్తవం వేరే విధంగా ఉంది. ఒకప్పుడు ఎన్నికల పార్టీలు కూడా ఓటర్లకు స్లిప్‌లను పంచిపెట్టేవి. ఇప్పుడు ఈ భారమంతా ఎన్నికల యంత్రాంగం తమ భుజస్కంధాల మీద తీసుకోవడంతో తానూ పని చేయక, ఇతరుల పనీ చెడగొట్టినట్లు అయ్యింది. - ఇంతకుముందు ఎన్నికలలో ఉన్న పార్టీలన్నీ చివరి నిమిషం వరకు తమ పార్టీ వర్గాలను సమీకరించి పోలింగ్‌కు సిద్ధంగా ఉంచేవి.

కానీ ఈసారి పోలింగ్‌ రోజున అలాంటి హడావుడి కనిపించలేదు. వచ్చే సీట్లు వస్తాయిలే అన్న నిరాశలో ప్రతిపక్ష పార్టీలు కూడా మునిగిపోయినట్లున్నాయి. తవ్వుకుంటూ పోతే తక్కువ పోలింగ్ మందకొడిగా సాగడానికి ఇలాంటి కారణాలు ఎన్నో కనిపిస్తాయి. ఈసారి బ్యాలెట్‌లో None of the above (NOTA) ఎంపికను ఉంచకపోవడం కూడా పోలింగ్‌ మీద కొంత ప్రభావం చూపిందంటున్నారు విశ్లేషకులు. వీటన్నింటి వల్లా జనాభాలో 50 శాతం మంది మాత్రమే ప్రజలు తమ నిర్ణయాన్ని చెప్పగలిగారు. మరి మిగతా సగం ప్రజల మనసులో ఏమున్నట్లు. మంగళవారం సెలవు వచ్చింది కదా అని సోమవారం కూడా సెలవు పెట్టుకుని నగరజీవితం నుంచి విశ్రాంతి తీసుకున్నారా? లేకపోతే ప్రస్తుత రాజకీయాలలో విసిగిపోయారా? లేక తమకంటూ ఓ నిర్ణయమే లేని జడత్వంలో మునిగిపోయారా?