ఉద్యోగులకు ఓటేయడం రాదా! 40 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చిత్తు! 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలైన మొత్తం 1,926 పోస్టల్ బ్యాలట్ ఓట్లలో దాదాపు 40 శాతం చెల్లకుండా పోయాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిలో కొంతమంది, 80 ఏళ్ళు దాటిన వృద్ధులు, వికలాంగులు పోస్టల్ బ్యాలట్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసిన వారిలో మెజార్టీ ఉద్యోగులే ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు వారి ఓట్లే చెల్లకుండా పోవడం విస్మయ పరుస్తోంది.  పోలింగ్ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఓటు ఎలా వేయాలో అవగాహన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వాళ్లే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ప్రజల చేత ఓట్లు ఎలా వేయిస్తారనే ప్రశ్న సామాన్యుల నుంచి వస్తోంది. అయితే ఓటేయం రాదని చెప్పడం సరికాదని, అభ్యర్థులు నచ్చక కొందరు ఉద్యోగులు కావాలనే చిత్తు చేస్తారని చెబుతున్నారు. దీనిపైనా విమర్శలు వస్తున్నాయి. అభ్యర్థులు నచ్చకపోతే నోటాకు ఓటు వేసే ఆప్షన్ ఉందని అలా  కాకుండా చిత్తు చేయడంతో ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తుందని మరికొందరు చెబుతున్నారు.

 

గ్రేటర్ పరిధిలో చెల్లిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మెజార్టీ బీజేపీకే పడ్డాయి.దీంతో ఉద్యోగులు కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళ లాంటిదంటూ టీఆర్ఎస్ నేతలు చెబుతుంచారు. అయితే గ్రేటర్ ఎన్నికల్లో ఆ రెండు కళ్లు అధికార పార్టీకి వ్యతిరేకంగానే నిలిచినట్లు కౌంటింగ్ లో తేలింది. ప్రభుత్వం నుంచి వివిధ రకాల సంక్షేమ పథకాలను అందుకున్న వృద్ధులు కూడా ఈసారి అధికార పార్టీకి ఓటు వేయకుండా బీజేపీ వైపు మళ్ళారు. ప్రభుత్వ సేవకులుగా ఉండే ఉద్యోగులు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగానే నిలిచారు.