TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వామ్మో స్వతంత్ర అభ్యర్థులు!

Published on: Tue Feb 2, 2016 9:13AM

గ్రేటర్‌ ఎన్నికల బరిలో 1333మంది అబ్యర్థులు ఉంటే వీరిలో దాదాపు సగం మంది స్వతంత్ర అభ్యర్థులే! ఎన్నికలు జరుగుతున్న 150 వార్డులలో కలుపుని 640 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారో ఏమో చెప్పడం కష్టం కానీ, వీరి వల్ల ఇతర పార్టీల అభ్యర్థులకు మాత్రం తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. సాధారణంగా టికెట్లను ఆశించి భంగపడినవారే స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగుతారు. అలా ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు బరిలో ఉండటం వల్ల అంతిమంగా ఎవరూ లాభపడని పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. టి.ఆర్‌.ఎస్‌ తరఫు నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు ప్రయత్నించిన వారందరినీ కె.టి.ఆర్‌ స్వయంగా నయానో భయానో బుజ్జగించి పోటీ నుంచి తొలగిపోయేట్లు చూశారు. కానీ మిగతా పార్టీలు అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకపోవడంతో, ఇప్పడు ఆ అభ్యర్థులే తమ గెలుపుకు గండికొట్టే అవకాశం ఉంది. స్వతంత్రంగా బరిలోకి దిగిన అభ్యర్థులకి ఎటు చూసినా లాభమే! గెలిస్తే తిరిగి తమకి ఇష్టం వచ్చిన పార్టీ జెండాకి సలాం కొట్టవచ్చు. ఓడితే ఇతరులను కూడా ఓడించామన్న తృప్తితో మరో అవకాశం కోసం ఎదురుచూడవచ్చు. మరి ఇవాళ జరుగుతున్న ఎన్నికలలో వీరి తడాఖా ఎలా ఉంటుందో చూడాలి!