TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ కు టీఆర్ఎస్ భయపడుతోందా..

Published on: Thu Jan 7, 2016 5:16PM

రాష్ట్ర విభజన తరువాత అన్ని పార్టీల సంగతేమో కాని టీఆర్ఎస్ పార్టీ మాత్రం విజయపంధాలో దూసుకుపోతుంది. తెలంగాణలో ప్రతిపక్షాలు ఉన్నా లేనట్టు అయిపోయింది పరిస్థితి. ఈ ధీమాతోనే టీఆర్ఎస్ నేతలు కూడా తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల నుండి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల వరకూ టీఆర్ఎస్ ఎదురులేకుండా.. ఎలాంటి భయం లేకుండా గెలుపును కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల పరిస్థితి వేరు.. గ్రేటర్లో సెటిలర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు కొంచం కష్టపడాల్సి వస్తుంది. అయితే తమ ప్రచారంలో తాము ఉండగా ఇప్పుడు టీఆర్ఎస్ మాత్రం ఒక వ్యక్తికి భయపడుతుందని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ వ్యక్తి ఎవరో కాదు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ-టీడీపీ కలిపి ప్రచారానికి పవన్ కళ్యాణ్ ను తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీ అప్పుడే అలర్ట్ అయిపోయి పవన్ కళ్యాణ్ పై ఎదురుదాడికి దిగుతున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే.. తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఈ పవన్ వ్యతిరేక దాడిని మొదలు పెట్టారు. పవన్ ది పవనిజం కాదని అది బ్రోకరిజమని.. ఆయన పవనిజం తెలంగాణలో పని చేయదని రవి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు సినిమాలు చూస్తేనే సినీ నటుడు పవన్కల్యాన్ ఎదుగుతున్నారని... ఇక్కడి రాజకీయాల్లో వేలుబెట్టి ఆడియన్సును పోగొట్టుకోవద్దని పరోక్షంగా హెచ్చరించారు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ అసలు ప్రచారానికి వస్తారో?రారో అని ఇంకా తెలియక ముందే టీఆర్ఎస్ మాత్రం అప్పుడే ఎదురుదాడికి దిగుతోంది. ఆయన వస్తారు అన్న వార్తలు వచ్చినందుకే టీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారంటే.. పవన్ కి భయపడ్డారని.. ఆయన వస్తే తమకు వచ్చే ఓట్లు కూడా పోతాయని భావిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు అనుకుంటున్నాయి. మొత్తానికి ఎవరికి భయపడని టీఆర్ఎస్ ను పవన్ భయపడేలా చేశారు. పవనా.. మజాకానా అని నిరూపించాడు.