పురానాపూల్‌లో ఏం జరిగింది?


ఈ నెల రెండో తేదీన గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ చాలా వరకూ ప్రశాంతంగానే జరిగింది. కానీ చివరి దశలో అనూహ్యంగా జరిగిన సంఘటన వల్ల కౌంటింగ్‌ను కూడా వాయిదా వేసి మళ్లీ ఒకచోట రీపోలింగ్‌ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. పురానాపూల్‌లో కాంగ్రెస్‌ తరఫున అభ్యర్థిగా నిలిచిన మహమ్మద్‌ గౌస్ ఒకప్పుడు మజ్లిస్‌లో కీలక నేత. కానీ తనకు మజ్లిస్‌ నుంచి సీటు దక్కకపోవడంతో కాంగ్రెస్‌ పక్షాన పోటీకి దిగారు. ఈ విషయంలో మజ్లిస్ కార్యకర్తలు మొదటి నుంచీ ఆయన మీద కోపంతో ఉన్నారు. స్థానిక మజ్లిస్‌ ఎమ్మెల్యే పాషాఖాద్రీ, గౌస్‌లకు మధ్య పోలింగ్‌నాటి ఉదయమే గొడవ జరగడంతో గౌస్‌ను అరెస్టు చేసి పోలిస్‌స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్‌ నాయకులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సాయంత్రం వేళకి గౌస్‌ను విడిపించుకుని తీసుకువెళ్లే ప్రయత్నంలో ఘర్షణ మొదలైంది. మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఓవైసీ వెంట వందలాది మంది మజ్లిస్ కార్యకర్తలు ఒక్కసారిగా పురానాపూల్‌కి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, లోపల ఉన్న షబ్బీర్‌ అలీ మీద కూడా దాడి చేశారు. ఈ విషయంలో పరస్పర కేసులు నమోదు కావడంతో అక్కడ రీపోలింగ్‌ను నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది.

నిజానికి మిగతా ప్రాంతాలతో పోలిస్తే పురానాపూల్‌లో ఓటింగ్‌ శాతం చాలా మెరుగ్గా ఉంది. అక్కడ 54 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇప్పడు వారంతా మళ్లీ ఓటు వేయాల్సి రావడంతో స్థానికంగా తిరిగి సెలవుని ప్రకటించారు. ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పురానాపూల్‌లో జరిగిన ఘటనకి పోలీసు వైఫల్యం కూడా కొంత కారణంగా కనిపిస్తోంది. ఉదయం నుంచి ఘర్షణ వాతావరణం నెలకొన్నా కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కానీ, నేతల మీద దాడి జరుగుతున్నప్పడు అడ్డుకోవడం కానీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. అక్కడ డిసిపిగా విధులను నిర్వహిస్తున్న సత్యనారాయణ చోద్యం చూస్తూ నిల్చున్నారని విపక్షాలు మండిపడ్డాయి. దాంతో ఆయనను విధుల నుంచి తప్పిస్తూ, ఈసారి పురానాపూల్‌ పోలింగ్‌ బాధ్యతను వేరొకరికి అప్పగించింది ఎన్నికల కమిషన్‌! ఎన్నికల సమయంలో పరస్పర దాడులు జరగడం కొత్త కానప్పటికీ… నేతలే తమ కార్యకర్తలను దగ్గరుండి ఉసిగొల్సడం, సాటి ప్రజాప్రతినిధుల మీద దాడి చేయించడం ఇప్పుడు సరికొత్త ఆనవాయితీకి దారి తీసింది. ఓటర్లు మాత్రం ప్రజాస్వామ్యం ఇంతకంటే మరింత దిగజారకుండా ఉండాలని ఆశిస్తున్నారు.