గ్రేటర్ ఎన్నికలతో ఎవరేంటో తేలిపోయిందా..?

రాజకీయాల్లో కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానాలు చెబుతుంది. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలను చూస్తుంటే కూడా అలానే అనిపిస్తుంది. ఎప్పటినుండో వీడని కొన్ని ప్రశ్నలకు ఈ గ్రేటర్ ఎన్నికల కారణంగా సమాధానం దొరికింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే..పార్టీల్లో అధినేత కాకుండా.. వారి తరువాత స్థానం ఎవరిది అనే విషయంపై ఒక స్పష్టత వచ్చినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రేపటి తరాల భవిష్యత్ రాజకీయ ప్రతిబింబాలు ఈ గ్రేటర్ ఎన్నికల ద్వారా తెలిసినట్టయింది.

మొట్టమొదటిగా టీఆర్ఎస్ పార్టీ విషయానికే వస్తే.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ కాబట్టి తనకు మొదటి స్థానం ఎలాగూ ఉంటుంది. అయితే కేసీఆర్ తరువాత ఎవరూ..? అంటే గతంలో అయితే కేసీఆర్ తరువాత అంతటి నాయకత్వపు లక్షణాలు ఉంది హరీశ్ రావుకే కాబట్టి వెంటనే అతని పేరు చెప్పేవారు. అందులోనూ హరీశ్ రావుకి కూడా కాస్త జనాదారణ ఎక్కువ కాబట్టి.. ఎలాంటి సందేహం లేకుండా కేసీఆర్ తరువాతి స్థానం హరీశ్ రావుదే అని అనుకునేవారంతా. కానీ కాలంతో పాటు అన్నీ మారుకుంటూనే వస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం టక్కున చెప్పాలంటే కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే హరీశ్ రావు స్థానాన్ని కేటీఆర్ ఆక్రమించారనిపిస్తోంది. దీనికి గ్రేటర్ ఎన్నికలే నిదర్శనం. గ్రేటర్ ఎన్నికల భాద్యతను మొత్తం తన భుజాలపై వేసుకొని.. తన వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకున్నారనే చెప్పొచ్చు. అటు తెలంగాణ వాదాన్ని వినిపిస్తూనే.. ఇటు సీమాంధ్రులను కూడా మెప్పించే విధంగా మాట్లాడుతూ బానే మార్కులు కొట్టేశారు. దీంతో కేసీఆర్ తరువాత రాజకీయ వారసుడిగా కేటీఆర్ అనే విషయం అందరికి అర్ధమయిపోయింది.

ఇక టీడీపీ విషయానికొస్తే పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినప్పటికీ ఆయన ఏపీ బాధ్యతను చూసుకోవాల్సి వుంటుంది. నారా లోకేశ్ ఎలాగూ జాతీయ ప్రధాన కార్యదర్సిగా ఉన్నారు. ఇక తెలంగాణలో పార్టీ బాధ్యతలు చూసుకోవడానికి చాలా మంది సీనియర్ నేతలు ఉన్నా కానీ.. వారందరి కంటే రేవంత్ రెడ్డే పార్టీకి పెద్ద దిక్కు అని తేలిపోయింది. ఎర్రబెల్లి, ఎల్.రమణ వంటి సీనియర్ నేతలు ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్న చందాన అయిపోయింది వారి పరిస్థితి.

ఇక మిగిలిన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, ఐంఎఐం పరిస్థితి అయితే ఎప్పటిలాగే ఉంది. రాష్టం విడిపోయి 19 నెలల అవుతున్నా ఇప్పటికీ సరైన నాయకత్వం లేదు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యకు ఇంకా పరిష్కారాన్ని చూడకపోవడం ఆశ్చర్యకరం. ఇక బీజేపీ విషయానికొస్తే ఆ పార్టీలో కూడా చరిష్మాకలిగిన నేతలు ఒక్కరూ కూడా లేరు. ఏదో సంప్రదాయబద్ద నేతలు తప్ప.. నాయకత్వంగా ఉండి పార్టీని ముందుకు నడిపించే నేతలు లేరు. ఎంఐఎం పార్టీ పాతబస్తీకే పరిమితం అని తేలిపోయింది. వైసీపీ పార్టీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టు ఉంది.

మొత్తానికి గ్రేటర్ ఎన్నికల్లో కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఇక ఎన్నికల ఫలితాలు కూడా వస్తే ఎవరి భవిష్యత్ ఎంటో.. ఇంకా మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని భావిస్తున్నారు. మరి అది తెలియాలంటే రేపు ఎన్నికల ఫలితాల వరకూ ఆగాల్సిందే.