మనకి కావల్సిందల్లా ‘భాగ్య’నగరమే!

ఎట్టకేళకు పోలింగ్ క్షణాలు వచ్చేశాయి. హైదరాబాద్‌ నగరపాలక సంస్థకు జరిగే ఎన్నికలలో 70లక్షల మందికి పైగా ఓటర్లు తమ నిర్ణయాన్ని తెలుపబోతున్నారు. 1300మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇన్నాళ్లూ ఎన్నికల వాగ్దానాలతో, ప్రతిపక్షాల మీద ఆరోపణలతో పార్టీలన్నీ నగరాన్ని హోరెత్తించాయి. చాలా పార్టీలు నమ్మశక్యం కాని వాగ్దానాలను చేశాయి. పార్టీలు, తాము ఇచ్చే హామీల గురించిన సాధ్యాసాధ్యాలను పట్టించుకునే సంప్రదాయం ఎప్పుడో కొట్టుకుపోయింది. ఓటరుని ఆకర్షించడంలోనే ఇప్పుడు వారికి ఆసక్తి. ఓటరు కూడా హామీల గురించి కాకుండా, ఎవరిని ఎన్నుకుంటే తమకు ఎక్కువ లాభం అన్న దిశగానే ఆలోచిస్తున్నాడు. ఓటు కోసం డబ్బు తీసుకునేవారు సైతం అంతిమంగా తనకి నచ్చినవారికే ఓటు వేస్తున్నారు.

‘ఇంతకీ హైదరాబాదులో నివసించే ప్రజలకి కావల్సింది ఏమిటి?’ అని మేయర్‌ పీఠాన్ని చేజిక్కించుకునే పాలకులు ఆలోచిస్తే జవాబు ఏమంత కష్టం కాదు. ఆ జవాబులని అమలు చేయడమే అసలైన కష్టం. ఈ మహానగరంలో ఇప్పటికీ జనం నీటి కోసం కోసం అల్లాడుతున్నారు. వేసవి వస్తే చాలు బోర్లు ఎండిపోతాయి, నీటి సరఫరా నిలిచిపోతుంది. పిల్లలకి మినరల్‌ వాటర్‌ క్యాన్లతో స్నానాలు చేయించాల్సిన పరిస్థితి. భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ కూడా కఠినమైన నిర్ణయాలను తీసుకోలేకపోయింది. అటు నగరానికి తాగు నీటికి తెచ్చేందుకు ఇంకా పక్క రాష్ట్రాల వైపు చూడాల్సి వస్తోంది.

ఇంట్లోకి ఎలాగొలా నీరు వస్తోంది సరే! ఆ నీటిని వాడాక మిగిలిన మురుగు బయటకి వెళ్లేందుకు చాలా ఇళ్లలో డ్రైనేజి సదుపాయం లేదు. నగరంలో అపార్టుమెంటులకి అపార్టుమెంటులే ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థా లేకుండా బతికేస్తున్నాయి. ఇంట్లో మాత్రమే కాదు, బయట రోడ్డు మీదకి అడుగుపెట్టినా సమస్యలే! మెట్రో పనుల వల్లో లేకపోతే ఇరుకు రోడ్ల కారణంగానో నగరంలోని ఒక చోట నుంచి మరో చోటకి వెళ్లడమంటే పొరుగూరికి ప్రయాణం చేసినట్లుగానే ఉంటోంది. నగరంలో ట్రాఫిక్ సమస్య ‘గంటటంటకీ’ పెరుగుతోందే కానీ తగ్గే సూచనలు కల్పించడం లేదు. పెరుగుతున్న జనాభాకీ, వాహనాలకీ అనుగుణంగా ట్రాఫిక్‌ని వేగవంతం చేయడం కోసం కానీ, గతుకులు లేని రోడ్లని నిర్మించడం కోసం కానీ ఏదైనా సత్వర ప్రణాళికని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నీరు, తాగునీరు, నిరంతర విద్యుత్తు, రోడ్లు, డ్రైనేజి, ట్రాఫిక్‌, కాలుష్యం… ఇలాంటి ప్రధాన సమస్యలకే ఇప్పుడు ప్రభుత్వాలు పరిష్కారం చూపాల్సి ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే- ‘వేసవిలో ఒక రోజు హైదరాబాదులోని ఓ మధ్య తరగతి వ్యక్తి హయత్‌నగర్‌ నుంచి కూకట్‌పల్లికి హాయిగా వెళ్లి రావడం అనేది అసాధ్యమైన కలగా మిగిలిపోకూడదు. సదరు వ్యక్తి ఇంటికి వచ్చిన తరువాత కాసేపు పంకా కింద కూర్చునే సౌలభ్యం, కాస్త కాళ్లూ చేతులూ కడుకున్నే సదుపాయాలు కూడా విలాసాలుగా మిగిలిపోకూడదు. ఒక మనిషి సౌకర్యంగా జీవించేందుకు కావల్సిన ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పించడమే ప్రభుత్వం నెరవేర్చాల్సిన తొలి హామీ!