ఎన్నికల ప్రచారంలో గుంపులు గుంపులు? కరోనా ముప్పు తప్పదా ?

కరోనా సెకండ్ వేవ్ భయపెడుతోంది. మహమ్మారి విజృంభణతో ఇప్పటికే పలు దేశాలు మరోసారి లాక్ డౌన్ అయ్యాయి. మన దేశంలోనూ కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. కేరళ, కర్ణాటక, గుజరాత్ లోనూ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అహ్మదాబాద్, గాంధీనగర్ లో నైట్ కర్ప్యూ అమలు చేస్తున్నారు. తాజాగా పంజాబ్ సర్కార్ కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తామని ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉంటుందని, మరో మూడు నెలల వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని WHOతో పాటు దేశంలోని ఐసీఎమ్మార్ కూడా హెచ్చరించింది. 

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ ఉంటే తెలంగాణలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి సంగతే మర్చిపోయారు జనాలు. హైదరాబాద్ లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతుండటంతో.. ప్రచారం హడావుడిలో కరోనా జాగ్రతలు మర్చిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా జనాలే కనిపిస్తున్నారు. వారిలో ఎవరికి మాస్క్ ఉండటం లేదు. భౌతిక దూరం అసలే పాటించడం లేదు. ఎన్నికల ర్యాలీలు, సభల్లోనూ వందలాది మంది పాల్గొంటున్నారు. మాస్కులు లేకుండానే, ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండానే గుంపులుగా తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. 

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రచారం చేసుకోవాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఇచ్చింది. కాని వాటిని పట్టించుకునే వారే లేరు. అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. రాజకీయ నేతలు కూడా 
కోవిడ్ రూల్స్ పాటించడం లేదు. మాస్కులు లేకుండానే వందలాది మందిని తీసుకుని  విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నారు. గ్రేటర్ లో రోడ్ షోలు నిర్వహిస్తున్న మంత్రి కేటీఆర్, ఎంపీ రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి  సంజయ్ .. ఇలా అందరూ అందరే. ఎన్నికల ప్రచారంలో ఏ ఒక్కరూ కోవిడ్ రూల్స్ పాటించడం లేదు. లీడర్లు మాస్కులు పెట్టుకోకపోవడంతో.. వారి బాటలోనే పార్టీ ద్వితియ శ్రేణి నేతలు,  కార్యకర్తలు కూడా మాస్కులు పక్కన పెట్టేశారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. తమ ముఖం ఓటరుకు కనిపించాలన్న ఉద్దేశంతో అభ్యర్థులు మాస్కుల్ని ధరించడం లేదు. దీంతో తమకెక్కడ వైరస్‌ సోకుతుందోనని ఓటర్లు వణికిపోతున్నారు. ఓట్ల కోసం తమ ఇంటికి వస్తున్న అభ్యర్థులు, నేతలను కొందరు ప్రజలు మాస్కులే లేవని గట్టిగానే మందలిస్తున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. 

గ్రేటర్‌ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అన్ని డివిజన్లకు ఇన్‌చార్జిలుగా తమ అగ్రనేతలను మోహరించాయి. దీంతో ఆయా నాయకులు తమ జిల్లాల నుంచి 
భారీగా కార్యకర్తల్ని వెంటబెట్టుకుని నగరానికి చేరుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక్కో డివిజన్‌లో ప్రచారం నిర్వహిస్తున్న వందలమంది స్థానిక కార్యకర్తలు, పొరుగు జిల్లాల నుంచి వచ్చిన పార్టీ జనాలతో   
నగర వీధులు జనసంద్రాలుగా మారాయి. ప్రచారంలో వందలాది మంది కూలీలు పాల్గొంటున్నారు. ప్రచారంలో ఎవరూ కనీస కరోనా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇదే ఆందోళనకు కారణమవుతోంది. ఆ జనంలో ఎవరిలో కరోనా ఉందో, ఎవరికి లేదో తెలియని పరిస్థితి. ఎన్నికల సంగతి దేవుడెరుగు.. ఇదెక్కడ తమ ప్రాణాల మీదకు వస్తుందోనని నగర ప్రజలు హడలిపోతున్నారు. 

ముందున్నది చలికాలం కావడం, ఎన్నికల ప్రచారంలో జనం భారీగా ఇంటింటికీ తిరుగుతుండటంతో.. డిసెంబరులో కేసులు తీవ్రంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల హడావుడిలో పడి కరోనా జాగ్రత్తలు తీసుకోకపోతే దారుణ పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా ప్రచారంలో కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని, తమ నేతలకు కూడా దీనిపై అలర్ట్ చేయాలని డాక్టర్లు , ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి.