రెచ్చగొట్టే మాటలు.. విద్వేష ప్రసంగాలు! గాడి తప్పిన గ్రేటర్ ప్రచారం

రోహింగ్యాలు.. పాకిస్తాన్.. సర్జికల్ స్ట్రైక్.. కూల్చేస్తాం.. తరమికొడతాం. ఇవి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో వినిపిస్తున్న మాటలు. స్థానిక ఎన్నికల్లో సాధారణంగా స్థానిక సమస్యలే కీలకంగా ఉంటాయి. స్థానిక సమస్యలు, ప్రజల అవసరాల అంశాలపైనే గతంలో ప్రచారాలు జరిగేవి. కాని ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్థానిక అంశాల ప్రస్తావనే రావడం లేదు. జాతీయ , అంతర్జాతీయ అంశాలు గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా మారిపోయాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కలకలం రేపుతున్నారు లీడర్లు. 

 

నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో నేతల విద్వేశపూరిత ప్రసంగాలు దుమారం రేపుతున్నాయి. అన్ని పార్టీల నేతలు పోటీపడీ మరీ నోటికి పనిచెబుతున్నారు. ఒకరిని మించి మరొకరు రెచ్చగొట్టే ప్రసంగాలతో విరుచుకుపడుతున్నారు. ఇష్టమెచ్చినట్లుగా మాట్లాడుతూ అలజడి రేపుతున్నారు. జనం సమస్యలు పట్టించుకోకుండా.. కాంట్రవర్సీ కామెంట్లతో కాక రేపుతున్నారు. ప్రచారాల తీరు, నేతల దూకుడుతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం దారి తప్పిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో నగర ప్రజల్లో ఆందోళన కూడా పెరుగుతోంది. 

 

బీజేవైఎం చీఫ్, బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య రాకతో మొదలైన గ్రేటర్‌ రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. మంగళవారం హైదరాబాద్‌ లో పర్యటించిన సూర్య.. ఎంఐఎం నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పాకిస్తాన్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు.అసద్ ను పాకిస్తాన్‌ జాతిపిత మహ్మద్‌ అలీ జిన్నాతో పోల్చారు సూర్య. దేశ విభజన సమయంలో హైదరాబాద్‌ సంస్థానాన్ని పాకిస్తాన్‌లో విలీనం చేయాలని జిన్నా డిమాండ్‌ చేశారని, ఒవైసీ కూడా అదే ఆలోచన విధానం ఉన్న వ్యక్తి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రొహింగ్యాలు, పాకిస్తాన్‌ ఓట్లు ఉన్నాయని.. పాకిస్తాన్‌ మద్దతు దారులే ఎంఐఎం పార్టీలో ఉన్నారని వ్యాఖ్యానించారు. తేజస్వి సూర్య విమర్శలపై ఒవైసీ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌లో పాకిస్తాన్‌, రొహింగ్యా ఓటర్లు ఉంటే కేంద్రహోం మంత్రి అమిత్‌ షా ఏం చేస్తున్నారు..? నిద్రపోతున్నారా? అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే భాగ్యనగరంలో రొహింగ్యాలకు షెల్టర్‌ ఇచ్చారని ఒవైసీ గుర్తుచేశారు. 
 

ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలతో అలజడి సృష్టిస్తున్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే పాతబస్తీలో సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామన్న ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. సంజయ్‌ కామెంట్స్‌ తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగానూ హాట్‌ టాపిక్‌గా మారాయి. సంజయ్ వ్యాఖ్యలపై దుమారం రేగుతుండగానే.. ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ రెచ్చిపోయారు. అక్రమ కట్టడాల తొలగింపుపై మాట్లాడుతూ.. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ ఘాట్స్‌ను కూల్చివేయాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్భర్ కామెంట్లకు కౌంటరిచ్చిన బండి సంజయ్.. పీవీ, ఎన్టీఆర్ సమాధులు కూల్చివేస్తే రెండు గంటల్లో ఎంఐఎం కార్యాలయం దారుస్సలాంను నేలమట్టం చేస్తామని హెచ్చరించాారు. బండి సంజయ్. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

 

గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు చేస్తున్న ప్రసంగాలపై నగర ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని, ప్రస్తుత పరిణామాలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం వస్తుందని చెబుతున్నారు. గ్రేటర్ ప్రచారంలో జరుగుతున్న పరిణామాలపై సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా పథకాలు, మేనిఫేస్టోలు తయారుచేసి, ఓటర్లను ఆకర్శించాలే గానీ ఇలా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలుకుతున్నారు.