వైసీపీని వీడనున్న ఘట్టమనేని

 

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సూపర్‌ స్టార్‌ కృష్ణ సోదరుడు, వైసీపీ క్రియాశీలక నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకొన్నారు. ఆదిశేషగిరిరావు సన్నిహిత వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు.. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పార్టమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన అనుకొన్నారు. అయితే, వైసీపీ అధినేత జగన్‌ ఆయనను విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని ప్రతిపాదించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆదిశేషగిరిరావు వైసీపీని వీడాలని నిర్ణయించుకొన్నారు. ఈ నేపథ్యంలో నేడో రేపో ఆయన రాజీనామా చేయనున్నారని సమాచారం.

సీఎం చంద్రబాబుకు ఆదిశేషగిరిరావు దగ్గర బంధువు. ఇప్ప‌టికే త‌న సోద‌రుడు కృష్ణ అల్లుడు గ‌ల్లా జ‌య‌దేవ్ టీడీపీ నుండి గుంటూరు ఎంపీగా ఉన్నారు. జ‌య‌దేవ్ త‌ల్లి అరుణ కుమారి టీడీపీలో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో..ఆది శేష‌గిరిరావు సైతం అటే వెళ్తారనే ప్ర‌చారం మొద‌లైంది. మరోవైపు నాడు వైయ‌స్ తో సన్నిహితంగా ఉన్న ఆదిశేషగిరిరావు..వైసీపీ ఆవిర్భావం నుండి జ‌గ‌న్ కు చేదోడు వాదోడుగా ఉన్నారు. కాగా త‌నతో తొలి నుండి క‌లిసి ఉన్న ఆదిశేష‌గిరి రావు పార్టీని వీడాల‌నే ఆలోచ‌నలో ఉన్నారనే సమాచారాన్ని పార్టీ నేత‌లు జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జ‌గ‌న్ నేరుగా ఆదిశేష‌గిరి రావుతో మాట్లాడుతార‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. మ‌రి, జ‌గ‌న్ ఆయ‌న‌ను ఏ ర‌కంగా బుజ్జ‌గిస్తారో.. ఏం హామీ ఇస్తారో వేచి చూడాలి.