ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
Published on: Tue Aug 23, 2022 10:49AM
ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు సోమవారం ( ఆగస్టు 22) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాజా సింగ్ వీడియో విడుదల చేసిన అనంతరం సోమవారం హైదరాబాద్ లో నిరసనలు వెల్లువెత్తాయి. ఏకంగా కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ఎదుటే నిరసనకారులు ఆందోళనకు దిగారు. అలాగే నగర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఆందోళనలు జరిగాయి.
రాజాసింగ్ తమ మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆయనను అరెస్టు చేయాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. దీంతో పలు చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను అదపులోనికి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే రాజా సింగ్ పై కేసు నమోదైంది. ఇంతకీ అసలు జరిగిందేమిటంటే కమేడియన్ మునావర్ ఫరూకీ హైదరాబాద్ లో స్టాండప్ కామెడీ షో నిర్వహిస్తే తానూ కామెడీ వీడియోను విడుదల చేస్తానని రాజా సింగ్ హెచ్చరించారు.
ఆ నేపథ్యంలోనే మునావర్ కామోడీ షోకు పోటీగా రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.


