జీఈఎస్‌లో టాలీవుడ్ మెరుపులు

మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ సమ్మిట్‌కు ప్రపంచ నలుమూలల నుంచి ప్రతినిథులు తరలివచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన పర్సనల్ అడ్వైజర్ ఇవాంకా ట్రంప్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసాధారణ స్థాయిలో ఏర్పాట్లు చేశాయి. ఈ సారి సమ్మిట్‌లో సగానికి పైగా (52.5శాతం) మహిళా ప్రతినిధులు పాల్గొవడం విశేషం. వీరిలో 175 మంది పారిశ్రామిక వేత్తలు, నూతన ఆవిష్కర్తలు, వివిధ కార్పోరేట్ సంస్థల ప్రతినిధులు, సినీతారలు, క్రీడాకారులు, ప్రభుత్వ ప్రతినిధులు వివిధ అంశాలపై చర్చించనున్నారు.

 

పెట్టుబడులును ఆకర్షించడం, గ్లోబల్ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నివ్వడం, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లకు చేయూతనివ్వడం ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశం. ఇంతటి ప్రతిష్టాత్మక సదస్సులో భాగమవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి. కాని అవకాశం కొద్దిమందికే కదా..? అన్నట్లు ఈ సమ్మిట్‌లో మన టాలీవుడ్ కూడా భాగమైంది.

 

రెండో రోజు ఉదయం సినీ రంగ భవిష్యత్తుపై జరగనున్న చర్చలో టాలీవుడ్ యంగ్‌హీరో రామ్‌చరణ్ తేజ్ ప్రసంగిస్తారు. సినిమాలు చేస్తూనే.. వ్యాపార రంగంలో కూడా చెర్రీ తన టాలెంట్‌ను నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఇక విలక్షణ నటుడు మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మీకి కూడా ఈ సదస్సులో పాల్గొనే అవకాశం లభించింది. మహిళల్లో ఔత్సాహికత, మహిళా పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొనే సవాళ్లు, వారి జీవితాల్లో సమతుల్యత వంటి అంశాలపై లక్ష్మీ మాట్లాడుతుంది.

 

ఇక ప్రసంగించే అవకాశం లేనప్పటికీ ఇవాంకాను కలిసే అవకాశం పొందింది అక్కినేని వారి కోడలు సమంత. అగ్రరాజ్యాధినేత గారాలపట్టికి చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సమంత సిద్ధిపేట గొల్లభామ చీరలని సెలక్ట్ చేసిందట.. ఈ చీరను తనే స్వయంగా ఇవాంకకి ప్రజంట్ చేస్తుందట. వీరే కాదు బాలీవుడ్ నుంచి అదితిరావ్ హైదరీ, దీపికా పదుకొనే కూడా పాల్గొంటారని సమాచారం. ఎక్కడైనా.. ఏ కార్యక్రమంలో అయినా సినిమా వాళ్లుంటే ఆ కిక్కే వేరు కదా...?