యూపీలో మంత్రి మిస్సింగ్..ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్
Published on: Sat Mar 4, 2017 9:20AM

ఉత్తరప్రదేశ్‌లో మంత్రి ఆదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. బాలికపై అత్యాచారయత్నం కేసులో నిందితుడైన మంత్రి గాయత్రీ ప్రజాపతి గత కొన్నాళ్లుగా కనపడకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో అలర్ట్ ప్రకటించారు. వాళ్లు తన తల్లిని పట్టుకుని, తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని ఆ బాలిక పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ తరపున ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.
ప్రజాపతి..అరెస్టును తప్పించుకోవడానికి విదేశాలకు పారిపోయేందుకు సిద్ధపడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు వారం రోజుల నుంచి కనపడకుండా అదృశ్యమైన ప్రజాపతి.. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మెడకు చుట్టుకుంది. ప్రధాని నరేంద్రమోడీ కూడా అఖిలేష్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు సంధిస్తున్నారు. వాస్తవానికి అవినీతి ఆరోపణల కారణంగా గత సంవత్సరమే గాయత్రీ ప్రజాపతిని అఖిలేష్ తన కేబినెట్ నుంచి తప్పించారు. అయితే ములాయం, శివపాల్ బలవంతం కారణంగా మళ్లీ తీసుకోవాల్సి వచ్చింది.


