TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సైబ‌ర్ ట‌వ‌ర్స్‌ను మించి.. ఇదే 'గేట్ వే ఆఫ్ ఐటీ పార్క్‌' స్పెషాలిటీ...

Published on: Fri Feb 18, 2022 2:01PM

సైబ‌ర్ ట‌వ‌ర్స్‌. చంద్ర‌బాబు హ‌యాంలో హైద‌రాబాద్‌లో సైబ‌రాబాద్ నిర్మాణానికి తొలి అడుగు. తెలంగాణ‌కే త‌ల‌మానికం ఆ ఐటీ బిల్డింగ్‌. 5 ల‌క్ష‌ల 25వేల చదరపు అడుగుల వ‌ర్క్ స్పేష్‌తో ఇప్ప‌టికీ ప్ర‌భుత్వ ప‌రంగా అదే టాప్‌. ఆ సైబ‌ర్ ట‌వ‌ర్స్ వ‌ల్లే.. సైబరాబాద్ సృష్టి సాకారం అయింది. మాదాపూర్‌, కొండాపూర్‌, గ‌చ్చిబౌలి, మ‌ణికొండ‌.. ఇలా ఆ ప్రాంత‌మంతా బంగారు తున‌కగా మారింది. హైద‌రాబాద్‌కు ఓ వైపు ఇలా ఐటీ వెలుగులు వెలిగిపోతుంటే.. మ‌రోవైపు ఇప్ప‌టికీ అండ‌ర్ డెవ‌ల‌ప్‌మెంటే. అందుకే, లేటెస్ట్‌గా కొంప‌ల్లి-మేడ్చ‌ల్ వైపు కూడా అతిపెద్ద ఐటీ పార్క్‌కు శ్రీకారం చుట్టింది తెలంగాణ స‌ర్కారు. కండ్ల‌కోయ‌లో 'గేట్‌వే ఆఫ్‌ ఐటీ పార్క్‌'కు శంకుస్థాప‌న జ‌రిగింది. 

మేడ్చల్‌ జిల్లా కండ్లకోయలో 250 కోట్ల ఖ‌ర్చుతో.. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించనున్న ఐటీ పార్క్‌కు భూమి పూజ చేశారు మంత్ర కేటీఆర్‌. ఐటీ పార్క్‌తో కొంప‌ల్లి-కండ్లకోయ-మేడ్చ‌ల్‌ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఐటీ అనేది కొండాపూర్‌, గచ్చిబౌలికే పరిమితం కాకుండా హైద‌రాబాద్‌ నలువైపులా ప్రగతి సాధించాలన్న ఉద్దేశంతో గ్రిడ్‌ను ఏర్పాటు చేసినట్టు కేటీఆర్ చెప్పారు. రానున్న రోజుల్లో దుండిగల్‌ సహా మరిన్ని ప్రాంతాల్లోనూ ఐటీ పార్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. 

ప్రస్తుతం సైబర్‌ టవర్స్‌ 5,25,000 చదరపు అడుగుల్లో విస్తరించి ఉండగా.. కండ్లకోయలో 6 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు. కొంపల్లిలోనూ టి-హబ్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు కేటీఆర్‌. ఇప్పటికే 90 పరిశ్రమలకు కండ్లకోయలో స్థలాలు మంజూరయ్యాయని చెప్పారు. కంపెనీలకు అవసరమైన నూతన నైపుణ్యాలు పెంపొందించుకుంటేనే ఇంజినీరింగ్‌ విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారని చెప్పారు. ఇక‌, కండ్ల‌కోయ‌లో 'గేట్ వే ఆఫ్ ఐటీ పార్క్‌' పూర్తైతే.. కొంప‌ల్లి చుట్టుప‌క్క‌ల ప్రాంతాలు మ‌రో గ‌చ్చిబౌలిలా మార‌డం ఖాయం!  మ‌రోవైపు, ఆ వైపున కేటీఆర్ అండ్ కో కు భారీగా భూములు ఉన్నాయ‌ని అంటున్నారు.