గ్యాస్ పైప్ లైన్ పేలుడు: బాబు దిగ్భ్రాంతి

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం ‘నగరం’ గ్రామం వద్ద ఈరోజు తెల్లవారుజామున గ్యాస్ పైప్ లైన్ పేలిపోవడంతో 15మంది మృతి చెందగా, 14మంది తీవ్రంగా గాయపడ్డారు. అమలాపురంలోని కిమ్స్‌లో 11 మందికి చికిత్స పొందుతున్నారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలించారు. ‘నగరం’ గ్రామంలో దాదాపు 50 ఇళ్ళు, దూకాణాలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. భారీగా ఆస్థి నష్టం జరిగినట్లు గ్రామస్తులు వాపోతున్నారు. గ్యాస్ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకొని మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రికి వస్తున్నట్లు తెలిపారు. గ్యాస్‌పైప్‌లైన్ పేలుడు ఘటనను సీరియస్‌గా తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.