కేజీ బేసిన్‌లో గ్యాస్ నిక్షేపాలు..నవ్యాంధ్ర ఇక స్వర్ణాంధ్రే..

తమ జీవధారలతో ఆంధ్రదేశాన్ని అన్నపూర్ణగా మార్చిన పవిత్ర కృష్ణా-గోదావరి నదీమ తల్లులు మరో వరాన్ని ఆంధ్రప్రజలకు అందజేశారు. పీకల్లోతు కష్టాలతో..కొండంత రెవెన్యూ లోటుతో ఆదుకునేవారు లేక అల్లాడుతున్న నవ్యాంధ్రకు చీకటిలో వెలుగు రేఖలా ఒక వార్త ఏపీ ప్రజల గుండెల నిండా సంతోషాన్ని తెచ్చింది. కృష్ణా-గోదావరి బేసిన్‌లో మరోసారి అపార సిరుల రాశి దొరికింది. మంచు రూపంలో నిక్షిప్తమై ఉన్న భారీ సహజవాయువు వనరులను బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ సారథ్యంలో జరిగిన అన్వేషణలో పాల్గొన్న అమెరికా జియోలాజికల్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది.

 

ఈ గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాలు అత్యంత సుసంపన్నమైనవని, వీటిని వెలికితీయవచ్చని తెలిపింది. ఇక్కడ బయటపడ్డ 134 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ నిక్షేపాల మొత్తం విలువ రూ.33 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా. రిలయన్స్ ఇండస్ట్రీస్ కనుగొని, నిర్వహిస్తున్న గ్యాస్ క్షేత్రమే ఇప్పటివరకూ మనదేశంలో అతిపెద్ద గ్యాస్ క్షేత్రం. అందులో 14 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ ఉన్నట్లు అప్పట్లో అంచనా వేశారు. అంటే ఇపుడు కనుగొన్న క్షేత్రం దాని కన్నా పది రెట్లు పెద్దది. సహజవాయువు, నీరు కలిసిపోయి ప్రకృతి సిద్ధంగా గడ్డకట్టి మంచురూపంలో ఉండటాన్ని గ్యాస్ హైడ్రేట్లుగా పరిగణిస్తారు. ఇవి ప్రపంచంలో మహా సముద్రాలు..ఖండాల అంచున, ధృవ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. అలాంటి అరుదైన గ్యాస్ నిక్షేపాలు ఆంధ్రతీరంలో దొరకడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. అంతేకాదు..ప్రపంచంలో ఇప్పటివరకూ గుర్తించిన అతి పెద్ద, అత్యంత సాంద్రతతో కూడిన గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాల్లో ఇది ఒకటి అని..సాక్షాత్తూ యూఎస్‌జీఎస్‌ శాస్త్రేవేత్తలే పేర్కొన్నారంటే దీని ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.

 

అన్నింటి కంటే ముఖ్యంగా ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈవార్త అమితానందాన్ని కలిగించింది. పెట్టుబడులు ఆకర్షించి రాష్ట్రంలో సంపదను సృష్టించాలని ఆయన చేయని ప్రయత్నం లేదు. ఆయన కష్టాన్ని చూసి నదీమ తల్లులే చలించి ఆపద కాలంలో ఆశీర్వదించి తమ గర్భంలో దాచుకున్న అమూల్యమైన సంపదను బయట పడేశారు. అంతా బాగానే ఉంది కాని మన దగ్గర దొరికింది మనకే చెందాలి..గతంలో కేజీ బేసిన్‌లో రిలయన్స్ సంస్థ కనుగొన్న చమురు నిక్షేపాలను ఆ సంస్థ వెలికితీసి గుజరాత్ రాష్ట్రానికి తరలించుకుపోయింది తప్ప ఆంధ్రప్రదేశ్‌కు చుక్క కూడా రాల్చలేదు. అఫ్‌కోర్స్‌.. దేశంలో ఎక్కడ ఏ సంపద దొరికినా అది జాతి సొత్తే..అది భారతీయులందరిది దానిని కాదనలేం. కానీ అది ఎక్కడైతే వెలుగు చూస్తుందో ఆ ప్రాంతానికి అందులో కొంత వాటా ఇవ్వాల్సిన అవసరం ఉంది.

 

తాజాగా వెలుగు చూసిన నిక్షేపాలపై ఈపాటికే కార్పోరేట్ సంస్థల కన్ను పడే ఉంటుంది. దీనిపై ప్రభుత్వాలు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సంపదను తన్నుకు పోవడానికి గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలతో పాటు కొన్ని కార్పోరేట్ సంస్థలు కూడా కాచుకుని కూర్చున్నాయి. అయితే ఈసారి అలాంటి ఆటలు ఏపీ ముందు సాగే ఛాన్స్‌ లేదు. ఎందుకంటే ఇక్కడుంది చంద్రబాబు నాయుడు. నిక్షేపాలపై ప్రకటన వచ్చి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ మీటింగ్‌లో దీనిపై చర్చించారు. కేజీ బేసిన్ నుంచి వెలికితీసే సహజవాయువును తొలుత ఏపీ అవసరాలకు కేటాయించాలని, ఆ తర్వాతే బయటకు తీసుకువెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. తాను ఇటీవల కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసినపుడు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలిపారు.

 

గ్యాస్‌పై హక్కు సాధించగలిగితే మనదగ్గర ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుత్ సంస్థలు, ఎరువుల కర్మాగారాలు, ఫెర్రో అల్లాయిస్‌ యూనిట్లకు చేయూతనిచ్చినట్లవుతుంది. అంతేకాకుండా మరిన్ని కొత్త సంస్థలు తమ యూనిట్లను నెలకొల్పడానికి ఆస్కారం లభిస్తుంది. తద్వారా ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడి నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టవచ్చు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కనుక వస్తే 2025 నాటికి ఆంధ్రప్రదేశ్‌ని దేశంలోనే నెంబర్‌వన్‌గా చూడాలన్న కల అతి త్వరగానే కళ్లముందు సాక్షాత్కరిస్తుంది.