గుప్త నిధుల కోసం విగ్రహాన్ని పెకలిన దుండగులు...

 

అనంతపురం జిల్లా కుందుర్పిలో తాజాగా జరిగిన సంఘటన కలకలం రేపుతోంది. గుప్త నిధుల కోసం ఏకంగా విగ్రహాన్నే పెకిలివేశారు దుండగులు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో పురాతన లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. గురువారం అర్ధరాత్రి గరుడ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గుప్త నిధులు ఉన్నాయనే సమాచారంతో విగ్రహాన్ని పెకలించి వేసారు.

అక్కడే రాత్రంతా గుంతలు తవ్వారు అయితే విగ్రహం ప్రతిష్టించిన చోట ఎలాంటి గుప్త నిధులు లేవని దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి, భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి దుండగులను పట్టుకునే పనిలో పడ్డారు. గరుడ విగ్రహం చుట్టూ రక్షణ కల్పించారు. జాగిలాలను రప్పించి క్లూస్ టీమ్ ద్వారా వేలి ముద్రలు సేకరించారు.

కుందారపులో పురాతన ఆలయాలు చాలా ఉన్నాయని వాటికి రక్షణ కల్పించాలనీ దేవాదాయ శాఖాధికారులను భక్తులు కోరుతున్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని ఆలయ పూజారి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆలయ కమిటీ సభ్యులు దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కల్యాణదుర్గం సీఐ శివ శంకర్ నాయక్ సూచించారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.