ప్రభుత్వ వర్సిటీలు ప్రైవేటుతో పోటీ పడలేవు-గవర్నర్‌

 

ప్రభుత్వ వర్సిటీలు ప్రైవేటుతో పోటీ  పడాలంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను గవర్నర్ ఖండించటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆంధ్ర విశ్వవిద్యాలయం 85, 86వ ఉమ్మడి స్నాతకోత్సవాన్ని విశాఖపట్నంలోని సర్‌ సీఆర్‌రెడ్డి మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ముఖ్య అతిథిగా ఐఐటీ- డిల్లీ సంచాలకులు వి.రామ్‌గోపాల్‌రావు,ఏయూ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్నాతకోత్సవంలో గవర్నర్‌.. 546 మందికి డాక్టరేట్‌లు, ఆరుగురికి ఎంఫిల్‌ డిగ్రీలు, వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన 573 మందికి పతకాలను ప్రదానం చేశారు. ఆచార్య రామ్‌గోపాల్‌రావుకు గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యారంగానికి ఏటా రూ.25 వేల కోట్లు వెచ్చిస్తూ రాష్ట్రంలో విజ్ఞాన సమాజాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రానికి ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వస్తున్నాయని, వాటితో పోటీ పడి ప్రభుత్వ వర్సిటీలు ఎదగాలని సూచించారు.

అనంతరం గవర్నర్‌  మాట్లాడుతూ మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలతో ప్రభుత్వ వర్సిటీలు పోటీ పడలేవని పేర్కొన్నారు. వర్సిటీల్లో పలు నియామకాలకు, పదోన్నతులకు పీహెచ్‌డీ చేసి ఉండాలన్న నిబంధన విధిస్తుండడంతో చాలా మంది వ్యక్తిగత ఆసక్తితో సంబంధం లేకుండా పీహెచ్‌డీ చేస్తున్నారని వాపోయారు. ‘‘ఎంతమంది పరిశోధనలు నాణ్యంగా ఉంటున్నాయి? ఎన్ని పరిశోధనలు సమాజానికి ఉపయుక్తంగా ఉంటున్నాయి? ఒక ఆచార్యుడు ఎంతోమందితో పీహెచ్‌డీలు చేయిస్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? బీఏ, బీకాంల మాదిరిగానే పీహెచ్‌డీలను కూడా ఒక డిగ్రీ తరహాలో చేస్తున్నారు. కట్‌, కాపీ, పేస్ట్‌’ సంస్కృతి ఎక్కువగా ఉంటోంది. దీనిపై దేశవ్యాప్తంగా సమీక్ష జరగాలి’’ అని గవర్నర్‌ వ్యాఖ్యానించారు.