గంటా వ్యూహాత్మక మౌనం....కారణం అదేనా ?

 

అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. సభలో టీడీపీ సభ్యుల సంఖ్య తక్కువే అయినా అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అన్నట్టు పోరాడుతోంది. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాధవ నాయుడు సహా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీకి కౌంటర్ ఇచ్చే విషయంలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఈ విషయంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు సైలెంట్‌గా ఉండటం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని బీజేపీలోకి వెళతారని కొద్దిరోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాను పార్టీ మారబోనని గంటా శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. 

అయినా సరే ఆయన జగన్ పాలన చేపట్టిన నాటి నుండే సైలెంట్ అయ్యారు. ఇప్పటి వరకు టీడీపీ నేతలు జగన్ పాలనపై కాస్తో కూస్తో ఆరోపణలు చేసినా, టీడీపీపై జరుగుతున్న దాడులపై అసహనం ప్రదర్శించినా గంటా మాత్రం చాలా సైలెంట్ గా చూస్తున్నారు. ఒకపక్క ఆయన వైసీపీలో చేరేందుకు కూడా వ్యూహాలు రచిస్తున్నారని, అయితే మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అడ్డు పడుతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. 

ఇంతకీ గంటా సైలెన్స్ వెనుక బలమైన కారణమే ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసిన సీఎం జగన్ గతంలో టిడిపి హయాంలో చేసిన అవినీతిపై దృష్టి పెట్టారు. ఇప్పుడు అవినీతి పుట్టలు బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అవినీతి చేసి కాస్తో కూస్తో వెనకేసుకున్న నాయకులలో టెన్షన్ మొదలైంది. అందులో భాగంగా ఇప్పుడు గతంలో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావుకు చెక్ పెట్టే పనిలో జగన్ సర్కార్ ఉన్నట్లుగా సమాచారం.  

గడిచిన ఐదేళ్లలో విశాఖ జిల్లాలో భూ దందాలు విపరీతంగా జరిగాయని ,విశాఖ భూ కుంభకోణం లో ఉన్నది టిడిపి నేతలేనని అప్పట్లో వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదాలో వైసిపి నాడు ఎంతో పోరాటం చేసినప్పటికీ నాడు అధికార పార్టీగా ఉన్న టిడిపి ఈ వ్యవహారంపై ఏమాత్రం స్పందించలేదు. గంటా శ్రీనివాసరావు వర్గంగా ఉన్న భీమిలి నేతలే పెద్ద ఎత్తున అక్రమ భూ సేకరణ చేశారని, అందుకే ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని అప్పట్లో పెద్దఎత్తున చర్చ సాగింది. 

ఇక ఇప్పుడు జగన్ విశాఖ భూ కుంభకోణాన్ని బయటకు లాగి కుంభకోణానికి కారణమైన బాధ్యులను చట్టరీత్యా శిక్షించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.విశాఖ భూకుంభకోణం పై సమగ్ర దర్యాప్తుకు జగన్ ఆదేశించటంతో ఇప్పుడు గంటా శ్రీనివాసరావుకు, గంటా వర్గానికి టెన్షన్ పట్టుకుంది. అందుకే గంటా సైలెంట్ గా ఉంటున్నారని అంటున్నారు. నిజానికి సొంత మంత్రులే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడంతో అప్పటి బాబు ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. 

ఈ సిట్ బృందం పలు కోణాల్లో విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి అందించింది. అయితే ఎన్నికల దెబ్బకి ఈ విషయం మరుగున పడింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గంటా ఈ వ్యవహారంలో ఏం చెయ్యాలో అర్ధం కాక సమావేశాలకి కూడా సరిగా రావడం లేదని అంటున్నారు.