TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గంటా, విష్ణుకుమార్ రాజు వివాదం.. టీ కప్పులో తుపాన్!

Published on: Wed Apr 30, 2025 11:51AM

సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు చిన్న చిన్న పొరపొచ్చారు, విభేదాలు తలెత్తడం సాధారణమే. అటువంటి చిన్న ఇబ్బందే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ నార్త్  ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు విష్ణు కుమార్ రాజు మధ్య తలెత్తింది. వారిరువురి మధ్యా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.  ఫిల్మ్ నగర్ లీజు అంశానికి సంబంధించి ఇరువురి  మధ్యా వాగ్వాదం జరిగింది.

విషయమేంటంటే ఈ లీజు వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ విష్ణుకుమార్ రాజు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.  ఆ సందర్భంగా ఆయన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు కూడా ప్రస్తావించారు. దీనిపై గంటా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లీజు విషయంలో అవకతవకలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడానికి ముందు స్థానిక ఎమ్మెల్యేనైన తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదన్నది గంటా అభ్యంతరం. ఈ విషయంలో ఇరువురి మధ్యా జరిగిన వాగ్వాదం ముదిరి పాకాన పడుతుందని అంతా భావించారు. అయితే సకాలంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జోక్యం చేసుకుని ఇరువురికీ  సర్ది చెప్పడంతో  ఈ వివాదం టీకప్పులో తుపానుగా తేలిపోయింది.   

విశాఖలో జరిగిన ప్రజా ఫిర్యాదులపై ఏర్పడిన శాసనసభ కమిటీ సమావేశం సందర్భంగా  రఘురామకృష్ణం రాజు ఇరువురు ఎమ్మెల్యేలనూ ఒక దగ్గర కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం నెరిపారని తెలుస్తోంది.  రఘురామకృష్ణం రాజు జోక్యంతో ఎమ్మెల్యేలు ఇద్దరూ కూడా విభేదాలను మరచి ఇరువురూ కలిసిపోయారని తెలుస్తోంది. సకాలంలో  జోక్యం చేసుకుని వివాదం ముదరకుండా నిలువరించడంలో రఘురామకృష్ణం రాజు చోరవ పట్ల కూటమి పార్టీల్లో హర్షం వ్యక్తమౌతోంది.