యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్

అందరూ ఊహించిందే జరిగింది. యూపీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఆత్మ రక్షణ కోసం జరిపిన కాల్పుల్లో వికాస్ దుబే చనిపోయినట్లు యూపీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. వికాస్‌ను మధ్యప్రదేశ్ నుంచి యూపీలోని శివ్లీకి తరలిస్తున్న క్రమంలో.. కాన్పూర్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల వాహనం బోల్తా పడింది. ఇదే అదునుగా వికాస్ దుబే పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కొని కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో వికాస్ దుబే మరణించాడని పోలీసు అధికారులు తెలిపారు. అతడి మృతదేహాన్ని కాన్పూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఒక డిఎస్పీ తో సహా 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న వికాస్ దూబెను మధ్యప్రదేశ్ పోలీసులు నిన్న ఉదయం ఉజ్జయిని మహాకాళి ఆలయం సమీపంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతడితో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఆ తరువాత మధ్యప్రదేశ్ పోలీసులు అతడిని యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించింది. ఉజ్జయిని నుంచి శివ్లీ (యూపీ)కి రోడ్డుమార్గంలో తరలిస్తుండగా వికాస్ ను తీసుకువస్తున్నఎస్టీఎఫ్ వాహనం కాన్పూర్ సమీపంలో బోల్తాపడింది. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

ఇప్పటికే యూపీలో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్ లో వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అమర్ దుబేని కాల్చి చంపగా గురువారం బహువా దుబే, ప్రభాత్ మిశ్రా లను ఎన్‌కౌంటర్ చేశారు.