TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లాహోర్ లో విదేశీ మహిళలపై సామూహిక అత్యాచారం.. పాక్ ఉప ప్రధాని సమీప బంధువు అరెస్ట్.!

Published on: Sat Jul 4, 2026 9:42AM

పాకిస్థాన్‌ లాహోర్‌లో విదేశీ మహిళలపై సామూహిక అత్యాచారం కేసులో ఆ దేశ ఉప ప్రధాని సమీప బంధువు అరెస్టు కావడం సంచలనంగా మారింది. వ్యాపార పెట్టుబడుల పేరుతో నమ్మించి, విదేశాల నుంచి మహిళలను రప్పించి, వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ అమానుష కాండలో పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ సమీప బంధువు ప్రధాన నిందితుడిగా ఉండటం పాక్ రాజకీయాల్లో  దుమారం రేపుతోంది.

బాధితుల్లో ఒకరు నెదర్లాండ్స్‌కు చెందిన మహిళ కాగా, మరొకరు వెనిజువేలా జాతీయురాలు. గత ఏడాది అక్టోబర్‌లో సింగపూర్‌లో వీరికి ప్రధాన నిందితుడైన మహ్మద్ రజా దార్‌తో పరిచయం ఏర్పడింది. వీరంతా క్రిప్టోకరెన్సీ వ్యాపార రంగంలో  భాగస్వాములుగా మారారు. ఈ వ్యాపారాన్ని మరింత విస్తరింపజేద్దామనే నెపంతో రజా దార్ వారిని పాకిస్థాన్‌కు ఆహ్వానించాడు.  కేవలం మాటలతోనే సరిపెట్టకుండా..  నమ్మకం కుదిరేలా వారికి అధికారికంగా బిజినెస్ వీసాలు కూడా స్వయంగా ఏర్పాటు చేశాడు. దీంతో అతడిని   నమ్మిన ఆ ఇద్దరు మహిళలు జూన్ 29న లాహోర్ విమానాశ్రయం చేరుకున్నారు.అయితే.. వారు లాహోర్ లో అడుగుపెట్టిన తరువాతయ రజా దార్ తన నిజ  స్వరూపాన్ని బయటపెట్టాడు. తన స్నేహితులతో కలిసి విమానాశ్రయం వెలుపల నుంచే ఆ ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేసి.. వారిని లాహోర్‌లోని ఒక రహస్య గృహంలో బంధించి  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  ప్రాణాలతో విడుదల కావాలంటే భారీ మొత్తంలో డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు దిగారు. బాధితులు తీవ్రమైన భయాందోళనల మధ్య నరకయాతనను అనుభవించారు.ఈ భయంకరమైన నేరం వెలుగులోకి రావడానికి ఒక అంతర్జాతీయ ఫోన్ కాల్ కారణమైంది. బందీలుగా ఉన్న మహిళల్లో ఒకరు చాకచక్యంగా తన తండ్రికి సమాచారం అందించగా.. ఆయన వెంటనే స్పెయిన్   నుండి లాహోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన లాహోర్ పోలీసులు   రంగంలోకి దిగి, ఆ రహస్య స్థావరంపై దాడి చేసి మహిళలను  రక్షించారు.  ఈ కేసులో ప్రధాన నిందితుడైన పాక్ ఉప ప్రధాని బంధువు మహ్మద్ రజా దార్‌తో పాటు అతని ముఠా సభ్యులు హసన్ రజా, సికందర్ ఖాన్, సాజిద్ అలీలను  అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఐదుగురు నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేసి లాహోర్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి ఐదు రోజుల  రిమాండ్ విధించింది. కోర్టు విచారణ సమయంలో బాధితులు ప్రధాన నిందితుడు రజా దార్‌ను స్పష్టంగా గుర్తించారు.  పరారీలో ఉన్న ఐదో నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Teluguone, Pakistan gang rape case, Lahore foreign women layout, Deputy PM Ishaq Dar relative arrested,