కేసీఆర్ ముందస్తు మైండ్ గేమ్..!!

తెలంగాణలో ఇప్పుడు ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది ముందస్తు ఎన్నికలు.. అసలు ముందస్తు ఎన్నికలు ఉన్నాయా? లేవా?.. తెరాస నిజంగానే అసెంబ్లీని రద్దు చేస్తుందా? అంటూ ప్రతిపక్షాలే కాదు సామాన్య ప్రజలు కూడా తలలు పట్టుకుంటున్నారు.. మీడియా కూడా ముందస్తు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ముందస్తు వార్తలు మొదలు పెట్టింది.. దీనంతటికీ మూల కారణం తెలంగాణ సీఎం కేసీఆర్.. అసలు ఇదంతా చూస్తుంటే కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

 

 

ఆ మధ్య కేసీఆర్ ముందస్తుకు సిద్ధంగా ఉండండి అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.. మరి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఏమన్నా తక్కువ తిన్నదా.. మేం ముందస్తుకి సిద్ధమంటూ ప్రతిసవాల్ విసిరింది.. కొందరైతే ప్రజల్లో తెరాస ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుందని గమనించే కేసీఆర్ ముందస్తుకు సిద్ధమయ్యారని విమర్శించారు.. తరువాత కొన్నిరోజులు ముందస్తు టాపిక్ చర్చ మందగించింది.. కానీ ఈ మధ్య మళ్ళీ ముందస్తు తెరమీదకు వచ్చింది.. ప్రగతి నివేదిక సభ గురించి చర్చించేందుకు కేసీఆర్ రీసెంట్ గా తెరాస నేతలతో సమావేశమైన విషయం తెల్సిందే.. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు మూడు నెలల్లో రావొచ్చు, ఆరు నెలల్లో రావొచ్చు ఎప్పుడైనా సిద్ధంగా ఉండండి.. నన్ను నమ్మండి మనదే విజయమని హామీ ఇచ్చారు.. ఇంకేముంది మళ్ళీ ముందస్తు వార్తలు మొదలయ్యాయి.. తెరాస సెప్టెంబర్ 6 న అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకి శ్రీకారం చుడుతోంది అని వార్తలు వచ్చాయి.

 

 

కానీ ఈ వార్తలపై తెరాస నేతల స్పందన భిన్నంగా ఉంది.. ముందస్తు ఎన్నికల గురించి చర్చలు జరుగుతున్న మాట నిజమే కానీ మూహూర్తాలు, తేదీలు మేం పెట్టుకోలేదు అని ఎంపీ వినోద్‌కుమార్‌ అంటే.. మేం అధికారికంగా చెప్పలేదు, ముందస్తు ఎన్నికలపై త్వరలో స్పష్టత వస్తుందని కేటీఆర్ అన్నారు.. దీంతో ముందస్తు మీద ఎవరికీ తోచినట్టు వారు ఊహించుకుంటున్నారు.. కొందరైతే ఇదంతా కేసీఆర్ మైండ్ గేమ్ అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. మీడియాని మిస్ లీడ్ చేస్తూ, మరోవైపు ప్రతిపక్షాలను కన్ ఫ్యూస్ చేస్తూ సడెన్ గా షాక్ ఇచ్చేలా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది... అసలు కేసీఆర్ మనస్సులో ఏముందో? మైండ్ లో ఏం ఆలోచిస్తున్నారో తెలియక అందరూ తలలు పట్టుకుంటున్నారు.. విశ్లేషకులు కూడా కేసీఆర్ ముందస్తుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని భావిస్తోన్నారు.. అయితే ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియకే అధికారికంగా ప్రకటించట్లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. మరి ముందస్తుపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎలా ముందుకెళ్తారో కాలమే నిర్ణయించాలి.