మా మాటే మీ మాట..!!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైఎస్ జగన్ పార్లమెంట్ సమావేశాల్లో జరిగిన అవిశ్వాస తీర్మానంతోపాటు పలు విషయాలపై మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న పార్లమెంట్‌లో జరిగిన తీరును, చర్చ సందర్భంగా ఏపీపై పెద్దలకున్న ప్రేమను చూస్తే నిజంగా బాధ అనిపించిందన్నారు. ఆనాడు అధికార, ప్రతిపక్ష పార్టీలు చంద్రబాబు నాయుడితో సహా అందరూ కలిసి రాష్ట్రాన్ని విడగొట్టడం జరిగిందని జగన్ చెప్పుకొచ్చారు.

 

 

నాలుగు సంవత్సరాలకు పైగా ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా,నిన్న అవిశ్వాసం మీద చర్చజరిగినప్పడు ప్రధాని నరేంద్ర మోదీ నోట ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి ఒక్క మాట కూడా రాలేదన్నారు. సీఎం చంద్రబాబు ఆమోదంతోనే హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చామని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీనే చెప్పారు. అసలు హోదాకు బదులు ప్యాకేజీని ఒప్పుకునే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు."గల్లా మాట్లాడిన మాటలు గత నాలుగేళ్లుగా మేం చెబుతున్న మాటలు కాదా?..నాలుగేళ్లుగా మేం మాట్లాడిన మాటలే గల్లా జయదేవ్ కూడా పార్లమెంట్‌లో చెప్పాడంతే" అని ఆయన స్పష్టం చేశారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎందుకు డిమాండ్ చేయలేదని జగన్ ప్రశ్నించారు.