అవిశ్వాసంపై చర్చ.. గళం విప్పిన గల్లా

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్బంగా, చర్చను ప్రారంభించిన గల్లా జయదేవ్.. లోక్ సభ సాక్షిగా ఏపీకి జరిగిన అన్యాయం గురించి నిలదీశారు.. 'అపనమ్మకం, ప్రాధాన్యం ఇవ్వకపోవడం, న్యాయపరమైన డిమాండ్లు, ధర్మపోరాట అనే నాలుగు అంశాలపై ఏపీ అవిశ్వాసం ప్రవేశపెట్టింది.. పార్లమెంటులో ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం జాతీయ సమస్య.. ఆధిపత్యానికి, నైతికతకు జరుగుతున్న పోరాటం ఇది.. అంతేగానీ కేంద్రానికి, ఏపీకి మధ్య ధర్మపోరాటం కాదు' అని గల్లా అన్నారు.. రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ కాదు.. విభజనలో భాగంగా ఆస్తులు తెలంగాణకు, అప్పులు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారు.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల వారు పెట్టుబడులు పెట్టారు.. విభజన తర్వాత ఆ‌ నగరం తెలంగాణలోనే ఉండిపోయింది.. దీంతో ప్రధాన ఆదాయ వనరును ఏపీ కోల్పోయింది.. ఏపీ పునర్విభజన బిల్లు ఆమోదం పొందడంలో కాంగ్రెస్‌తో పాటు భాజపా కూడా ప్రధాన పాత్ర పోషించింది.. ఇదే సభలో ఆ బిల్లును ఎలా ఆమోదించారో దేశం మొత్తం చూసింది.. సమైఖ్యంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌ పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఉండేది.. ఇప్పుడు అన్నింటికంటే వెనుకబడి ఉంది.. వ్యవసాయంలో కాస్త మెరుగ్గా ఉన్నా.. పారిశ్రామిక, సేవల రంగంలో అట్టడుగునే ఉంది. తలసరి ఆదాయంలోనూ ఏపీ వెనుకబడే ఉందని అన్నారు.

 

 


ఏపీకి ఇచ్చిన ప్రతి రూపాయి కూడా విభజన చట్టంలో భాగంగా ఇచ్చినదే.. ఆ నిధులన్నీ కచ్చితంగా ఇచ్చి తీరాల్సినవే.. ఎంతో ఉదారంగా సాయం చేశామని చెప్పడం శుద్ధ అబద్ధం.. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి రూ.3వేల కోట్లు, గుజరాత్‌లో పటేల్‌ విగ్రహానికి రూ.3,500కోట్లు ఇచ్చారు.. మా రాజధాని నిర్మాణానికి ఇచ్చింది మాత్రం వెయ్యి కోట్లు.. పోలవరానికి రూ.58,600 కోట్లయితే.. రూ.6వేల కోట్లు మాత్రమే ఇచ్చారు అన్నారు.. కాంగ్రెస్‌ తెలుగుతల్లిని రెండుగా చీల్చి రాష్ట్ర విభజన చేసిందని మోదీ అప్పట్లో అన్నారు.. కాంగ్రెస్ తల్లిని చంపేసి బిడ్డను బతికించిందని వ్యాఖ్యానించారు.. అయితే విభజన పాపంలో బీజేపీకి కూడా సగం పాత్ర ఉంది.. గతంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో ఇచ్చిన హామీపై ప్రస్తుత ప్రధాని మోదీకి గౌరవం ఉందా?.. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని మీ పార్టీ సభ్యులే డిమాండ్‌ చేసిన సంగతి గుర్తుందా?.. తిరుపతి, నెల్లూరు సభల్లో మీరిచ్చిన హామీలు గుర్తున్నాయా? అని ప్రశ్నించారు.. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వొద్దని చెప్పిందని కేంద్రం చెబుతోంది.. ఇది పూర్తిగా అబద్ధం.. మేమెప్పుడూ అలా చెప్పలేదని 14వ ఆర్థిక సంఘానికి ప్రాతినిధ్యం వహించిన గోవిందరావు చెప్పారు.. ప్రధాని, ఆర్థిక మంత్రి అవాస్తవ విషయాలను గమనించాలి.. మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా.. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని ఆవేదన వ్యక్తం చేసారు.