గల్లా ఫుడ్స్ పై చిత్తూరు జిల్లా రైతుల ఆగ్రహం
Published on: Wed Mar 21, 2012 3:19PM
రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి కుటుంబానికి చెందిన గల్లా ఫుడ్స్ ఫ్యాక్టరీపై జిల్లా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గల్లా కుటుంబం పూతలపట్టు వద్ద వందలాది కోట్లు వెచ్చించి వ్యవసాయ ఆధార పరిశ్రమను ఏర్పాటు చేసింది. జిల్లాలో ప్రధానంగా పండే మామిడి, అరటి, బత్తాయి పంటలను రైతులనుంచి కొనుగోలుచేసి జ్యూస్, పల్స్ గా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఇండస్ట్రీ పెట్టడం వల్ల మా పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుందని మొదట రైతులు భావించారు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా పరిస్థితులు ఉండడంతో వారు ఫ్యాక్టరీ యాజమాన్యంపై కన్నెర్రజేస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం జిల్లాలోని మిగిలిన వ్యాపారులతో కుమ్ముక్కై తాము నిర్ణయించిన రేటుకే మామిడి, అరటి, బత్తాయి విక్రయించాలని పట్టుబడుతున్నారు. వ్యాపారులంతా ఫ్యాక్టరీ యాజమాన్యంతో కుమ్ముక్కుకావడంతో గత ఏడాది రైతులు బాగా నష్టపోయారు.
ఈ ఏడాది కూడా అదే పరిస్థితి తలెత్తడంతో వారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. గత ఏడాది తాము సుమారు లక్ష టన్నుల మామిడిని కారు చౌకగా గల్లా ఫుడ్స్ ఫ్యాక్టరీకి విక్రయించామని, తాము పండించిన పంటతో ఫ్యాక్టరీకి సుమారు రూ.30 కోట్ల లాభం వచ్చిందని రైతులు అంటున్నారు. ఈ సీజన్ లో తాము నిర్ణయించిన ధరను ఫ్యాక్టరీ యాజమానయం చెల్లించకపొతే తమ పంటను వేరే చోటికి తరలిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. నిజానికి తమకు చిత్తూరుజిల్లా మారుమూల ప్రాంతంలో వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఫ్యాక్టరీని ఏర్పాటుచేయాల్సిన అవసరంలేదని ఫ్యాక్టరీ యాజమాన్యం అంటోంది. ఈ ప్రాంత అభివృద్ధికోసమే తాము ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని ఫ్యాక్టరీ నిర్మించామని, రైతులు ఈ పరిస్థితిని అర్థంచేసుకోవాలని యాజమాన్యం అంటోంది. అయితే రైతుల వాదన మరోలా ఉంది. గ్రామీణ ప్రాంతంలో మంత్రి గల్లా అరుణకుమారి భర్త ఫ్యాక్టరీని నెలకొల్పి కేంద్రప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున సబ్సీడీలు పొందారని, అంతేకాక అధికారులను లొంగదీసుకుని అటవీ భూములను ఆక్రమించుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా మామిడి రేటుపై ఈ ఏడాది గల్లా ఫుడ్స్ స్థానిక రైతులకు మధ్య వివాదం తలెత్తే పరిస్థితి ఏర్పడింది.


