ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గల్లా అరుణ మధ్య చిచ్చురేపిన తిరుపతి
Published on: Tue Mar 20, 2012 12:49PM
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రమంత్రి గల్లా అరుణకుమారి మధ్య తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపిక అంశం విభేదాలను సృష్టించింది. రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ టిక్కెట్ ను తన కుమారుడు గల్లా జయదేవ్ కు ఇప్పించుకోవాలని అతని తల్లి గల్లా అరుణకుమారి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికీ ప్రాతినిధ్యం ఇవ్వమనటం సబబుకాదని, దీనికి తోడు గల్లా అరుణకుమారి కొడుకు గల్లా జయదేవ్ కు రాజకీయ' అనుభవం కూడా లేదని ముఖ్యమంత్రి అన్నట్లు తెలిసింది. గల్లా జయదేవ్ కొంతకాలం పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని ఆ తరువాత పార్టీ టిక్కెట్ ను ఆశిస్తే బావుంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గ సహచరిణి గల్లా అరుణకుమారికి సలహా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో తీవ్ర నిరాశకు గురయిన అరుణకుమారి వైఎస్ బతికుంటే తనకు ఇట్లా జరిగివుండేది కాదని వాపోయినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి మద్దతు వున్నా లేకపోయినా ఆమె ఢిల్లీ స్థాయిలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.


