గాలి చివరి క్షణాల్లో అడిగింది ఎవరినో తెలుసా...?


టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు నిన్న కన్ను మూసిన సంగతి తెలిసిందే కదా. గత కొంత కాలంగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఆయన మృతి  పట్ల టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. అయితే ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. గాలి ముద్దుకృష్ణమ నాయుడు, తన చివరి క్షణాల్లో ఒకే ఒక్క వ్యక్తి గురించి అడిగాడట. ఇప్పుడు అతనెవరో తెలిసిపోయింది. అతను ఎవరో కాదు.  గడచిన 20 సంవత్సరాలుగా తనకు  డ్రైవర్ గా, వ్యక్తిగత సహాయకుడిగా, నమ్మినబంటుగా ఉన్న చంద్ర గురించట. గతవారం జ్వరంతో ఉన్న ఆయన్ను రేణిగుంట విమానాశ్రయానికి తీసుకెళ్లి హైదరాబాద్ విమానం ఎక్కించాడట. ఆపై గాలి, హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో చేరి డెంగ్యూ జ్వరానికి చికిత్స పొందుతున్న వేళ, పరిస్థితి విషమించింది. ఆపై తన కుటుంబీకులతో చంద్రను పిలిపించాలని, వాడిని చూడాలని ఉందని గాలి చెప్పారట. విషయాన్ని చంద్రకు చేరవేసిన బంధువులు, అతన్ని హుటాహుటిన మంగళవారం నాడు హైదరాబాద్ కు రప్పించారట. అప్పటికే గాలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆయన్ను చూసిన చంద్ర కుదేలయ్యాడు. ఆయన మరణించిన తరువాత "అయ్యా... లే అయ్యా... నీ కోసం ఎంత మంది వచ్చారో చూడయ్యా" అంటూ చంద్ర విలపిస్తుండటం పలువురి హృదయాలను ద్రవింపజేసింది.