TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ రెండు బస్తాల పత్రాల్లో నేతల గుట్టు?

Published on: Mon Jul 2, 2012 4:48PM

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి బెయిల్‌ ముడుపుల కేసులో నిందితుడైన రౌడీషీటరు యాదగిరిరావు ఇంటి నుంచి ఏసిబి స్వాధీనం చేసుకున్న రెండు బస్తాల విలువైన పత్రాల్లో ఏముందీ? దీనిలో ఏమైనా రాజకీయ నేతల గుట్లు దాగున్నాయా? అన్న ప్రశ్నలు రాష్ట్రంలో సంచలనమయ్యాయి. అత్యంత విలువైన పత్రాలు లభించాయని ఏసిబి తెలపటంతో యాదగిరిరావుతో ఆర్థిక సంబంధాలున్న నేతలు గతుక్కుమన్నారు. ఈ పత్రాల ద్వారా ఇప్పటి వరకూ వెలుగుచూడని కొత్త పాత్రలను ఏసిబి తెరపైకి తెస్తుందన్న ఆసక్తి కూడా ఎక్కువైంది. సాక్షాత్తూ జ్యూడీషియల్‌ స్థాయినే మేనేజ్‌ చేయగలిగిన యాదగిరిరావు ఇంకెంత మందిని తన గుప్పెట్లో దాచారని ఆసక్తి ఆపుకోలేక ఇప్పటికే కొందరు ఏసిబి కార్యాలయంలో పని చేసే సిబ్బందిని ప్రశ్నిస్తున్నారట. అయితే విచారణ నేపథ్యంలో అన్ని విషయాలు మీడియాకు వస్తాయి కదా అని సిబ్బంది కూడా తెలివిగా సమాధానమిస్తున్నారని సమాచారం. కర్నాటక రాష్ట్రంలోని బిజెపి నేత గాలిజనార్దనరెడ్డి, ఆయన అనుయాయులు కూడా యాదగిరిరావు చిరపరిచితులే. అందుకే వారి పనులు చేస్తూ తన జీవితాన్ని కులసాగా లాక్కొస్తున్న యాదగిరిరావు గుట్టు సిబిఐ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత కేసును ఏసిబికి అప్పగించారు. ఫలితంగా హైదరాబాద్‌ నాచారంలోని యాదగిరిరావు ఇంటిపై ఏసిబి దాడులు చేసి బెయిల్‌ కేసులో లబ్ది పొందిన రెండు కోట్ల 25 లక్షల రూపాయలను ఇంటిపై వాటర్‌ట్యాంకులో దాచుకుంటే బయటికి తీయించి ఏసిబి స్వాధీనం చేసుకుంది. ఆ ఇంటికి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో రహస్యంగా దాచిన రెండు బస్తాల పత్రాలనూ స్వాధీనం చేసుకుంది. దీంతో ఇప్పటిదాకా యాదగిరిరావును నమ్మినవారంతా హతాశులయ్యారు. ఆ పత్రాల్లో తమ వివరాలు ఉంటే వాటిని కూడా ఏసిబి పరిశీలిస్తుందని ఇప్పటి వరకూ తెరకు పరిచయం కాని పాత్రధారులు వాపోతున్నారు. యాదగిరిరావుకు ఆంధ్రా, కర్నాటక రాష్ట్రాల్లో ఉన్నతస్థాయి అధికారులతో సంబంథాలున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే యాదగిరిరావు ద్వారా లబ్ది పొందిన వారందరూ తెరవెనుక పావులు కదుపుతున్నారని తెలిసింది. ప్రత్యేకించి కాంగ్రెస్‌ పార్టీలోని పెద్దలకు ఈయనతో సంబంధాలున్నాయని కీలకసమాచారం వెలుగులోకి వచ్చింది. ఇది కూడా ఆ పార్టీ నేతలను వణికిస్తోంది. ఈ కేసులో ఇంకెన్ని సంచలన సమాచారాలు తెలుస్తాయోనన్న ఆసక్తి మాత్రం ఎక్కువైంది.