గాలికి బెయిల్ లో జగన్ బంధువు కీలకపాత్ర
Published on: Sun Jun 3, 2012 10:04AM
గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం వ్యవహారంలోజగన్ బంధువు వైవి సుబ్బా రెడ్డిది కీలక పాత్ర పోషించాడని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డికి సుబ్బా రెడ్డి దగ్గరి బంధువని, సిబిఐ కోర్టు న్యాయమూర్తితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ముందుగా గాలికి బెయిల్ ఇప్పిస్తే తర్వాత జగన్‌ను కూడా అదే మాదిరిగా బయటకు తీసుకురావచ్చునని సుబ్బా రెడ్డి ముందుండి ఈ వ్యవహారం నడిపించారని చెప్పారు. అవినీతిని వెలుగులోకి తేవడంలో సిబిఐ కృషిని ప్రజలు అభినందిస్తున్నారన్నారు. అదే విధంగా సుబ్బా రెడ్డి పాత్రపై కూడా సిబిఐ విచారణ జరపాలన్నారు. న్యాయ శాఖ మంత్రిగా ఉన్న ఏరాసు ప్రతాప రెడ్డి.. అక్రమ మార్గంలో గాలి బెయిలు పొందడానికి సహకరించడం దారుణమని, ఆయనను మంత్రివర్గం నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే తప్పించాలని కోరారు.


