గజపతి రాజుల పరువు బజారున పడేస్తున్న వారసులు...

కొన్ని నెలల క్రితం మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ గా ఆనంద గజపతిరాజు మొదటి భార్య సంతానం ఐన సంచయిత గజపతిరాజు పదవి చేపట్టిన నాటి నుండి గజపతి రాజు కుటుంబీకుల మధ్య వివాదాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా, విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తమను సంచయిత అవమానించిందని ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతిరాజు ఆరోపించారు. ఈరోజు తమ బంగ్లాలో ఊర్మిళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచయితపై తీవ్ర విమర్శలు చేశారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడం రాజ కుటుంబికులుగా తమకు ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోందని, ఈ ఏడాది కూడా తన తల్లి సుధా గజపతిరాజుతో కలిసి సిరిమాను ఉత్సవానికి వచ్చానని ఆమె తెలిపారు. అమ్మవారి వేడుకలు చూసేందుకు కోటలోకి వచ్చిన తమ పట్ల సంచయిత అవమానకర రీతిలో ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను తన తల్లితో కలిసి కోటలోకి ప్రవేశించగానే... తమ రాకను గమనించిన సంచయిత తన సిబ్బందిపై మండిపడి, వీళ్లను కోటలోకి ఎవరు రానిచ్చారు అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసిందని ఊర్మిళ వెల్లడించారు. దీంతో కోటపై ముందు వరుసలో ఉన్న తమను వెనక్కి వెళ్లాలని తమ దగ్గరకు వచ్చి ఈవో చెప్పారని ఆమె వివరించారు. అయితే, ఆ ఈవోను పర్మిషన్ అడిగి కొంతసేపు అక్కడే కూర్చుని దర్శనం చేసుకుని వచ్చేశామని ఆమె తెలిపారు.

 

అయితే ఈ తరహా అనుభవం ఎదురవుతుందని తమకు ముందే తెలుసని, సంచయిత ఎంతో అహంకారంతో ప్రవర్తిస్తోందని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా మాన్సాస్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా తన తల్లిని ఇంతవరకు ప్రమాణస్వీకారం కూడా చేయనివ్వలేదని ఊర్మిళ వెల్లడించారు. మాన్సాస్ ట్రస్టును సంచయిత తన సొంత సంస్థలా భావించి అధికారం చెలాయిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. సంచయిత చేస్తున్న చేష్టలు దివంగత ఆనంద గజపతిరాజుకు అవమానకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. కోట బురుజుపై నుంచి సిరిమాను ఉత్సవం తిలకించే హక్కు ఆనంద గజపతి వారసులుగా తమకు కూడా ఉందని ఊర్మిళ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

 

కాగా, నిన్న ఊర్మిళ, సుధా గజపతిరాజులను అక్కడ్నించి పంపించేందుకు పోలీసులు నిస్సహాయత వ్యక్తం చేయడంతో... సంచయిత కోట బురుజుపై మరో వైపున కుర్చీ వేసుకుని కూర్చుని సిరిమానోత్సవ వేడుకలు తిలకించారు. దీంతో పైడితల్లి సిరిమానోత్సవం ఈసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. అమ్మవారి సాక్షిగా రాజ కుటుంబంలో ఇప్పటికే ఉన్న విభేదాలు తాజా ఘటనతో మరింత చెలరేగాయి.

 

దీంతో సింహాచలం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా నియమించబడ్డ సంచయిత వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఎంతో గౌరవంగా జరగాల్సిన ఈ పవిత్ర కార్యక్రమం రసాభాసగా మారింది. దీంతో అందరి దృష్టి రాజకుంటుంబంపై పడింది. తాజా ఘటనపై సంచయిత గొప్పగా ఫీలవుతుంటే.. మరో పక్క ఊర్మిళ గజపతి మాత్రం ఇది రాజ కుటుంబానికి అవమానకరమని, బాధాకరమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులందరూ హాజరు కావాల్సిన కార్యక్రమంలో మమ్మల్ని పాల్గొనకూడదని ఆంక్షలు విధించడానికి అసలు సంచయిత ఎవరని ఊర్మిళ ప్రశ్నించారు.