గెయిల్ దుర్ఘటన: ప్రణబ్ దిగ్భ్రాంతి

 

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ గ్యాస్ పైప్ లీక్, అగ్ని ప్రమాదం ఘటనలో 14 మంది మరణించడంపై భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. సంఘటన విషయం తెలియగానే ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పైపు లైన్ పేలుడు వల్ల పది అడుగుల గొయ్యి పడిందని తెలిసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు.ప్రభుత్వ యంత్రాంగం మొత్తం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆయన సూచించారు. ఇంత పెద్దప్రమాదం జరిగిందన్న విషయం తెలియగానే తాను ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యానని, క్షతగాత్రులకు వైద్యసేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా పాల్గొంటుందని ఆశిస్తున్నానని ప్రణబ్‌ ముఖర్జీ చెప్పారు. కాగా, ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.