TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రాణాలు పోతున్నా షరా మామూలే

Published on: Fri Jun 27, 2014 6:13PM

 

షరా మామూలుగా మళ్ళీ ఘోర ప్రమాదం జరగడం, అన్నెంపున్నెం ఎరుగని పసిపిల్లలతో సహా అనేకమంది ప్రజలు మృత్యువాత పడటం, నేతల దిగ్భ్రాంతి, సానుభూతులు, పరామర్శలు, తలకో ఇంత అని ఎక్స్ గ్రేషియా ప్రకటనలు అన్నీ చాలా పద్దతిగా జరిగిపోతున్నాయి. అయితే ఇవ్వన్నీ ఇంత పద్దతిగా చేయగలుగుతున్నప్పుడు, పదేపదే పునరావృతమవుతున్న ఇటువంటి ప్రమాదాలను మాత్రం అరికట్టడంలో ఎందుకు విఫలం అవుతున్నాము? అని ప్రశ్నించుకొంటే, మళ్ళీ షరా మామూలుగా అవే సమాధానాలు- నిర్లక్ష్యం, మానవ తప్పిదం అని నిర్లజ్జగా చెప్పుకోవలసి వస్తుంది. ఈ సంగతి మన ప్రభుత్వాలకి బాగానే తెలుసు. అందుకే అలవాటు ప్రకారం ముందుగా ఒక విచారణ కమిటీ వేసేస్తాయి. ఆ తరువాత ఈ ఘోర తప్పిదానికి కారకులయిన వారు ఎంత పెద్దవారయినా విడిచిపెట్టేదే లేదని గంభీరంగా ప్రకటిస్తారు. ఇది కూడా ఆ ఆనవాయితీలో భాగంగానే అనుకోవలసి ఉంటుంది. ఇంతవరకు వేసిన అనేక కమిటీలు ఏమి కనిపెట్టాయో, అటువంటి వాటికి ఎవరిని శిక్షించారో, వాటి నివేదికల ఆధారంగా ఇటువంటి ప్రమాదాలు, దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఏమి చర్యలు తీసుకొన్నారో ఎవరికీ తెలియదు. అందుకే ఇటువంటి ఘోర దుర్ఘటనలు పదేపదే పునరావృతం అవుతున్నాయి. మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. బహుశః ఈరోజు నగరం గ్రామంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై విచారణ జరిపేందుకు వేసిన కమిటీ కూడా శతకోటి కమిటీలలో మరొక కమిటీగా మిగిలిపోయినా ఆశ్చర్యం లేదు.

 

ప్రభుత్వం, అధికారులలో చిత్తశుద్ధి లేనప్పుడు, మీడియా నిలదీయాలి. కానీ సంచలన వార్తల వెంట పరుగులు తీస్తున్న మీడియా, రేపు ఇటువంటిదే మరో సంచలన సంఘటన జరగగానే, ఈ ఘోర దుర్ఘటనను తమ లైబ్రేరీ సెక్షన్ కి పంపించేసి, మిగిలిన చానల్స్ తో పోటాపోటీగా ఆ సరికొత్త దుర్ఘటన గురించి హృదయ విదారకంగా వర్ణిస్తూ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తుంది. దురదృష్టవశాత్తు ఇది కూడా ఆ అనవాయితీలో భాగమయిపోయింది. ఈరోజు జరిగిన ఘోర దుర్ఘటనను సదరు గెయిల్ సంస్థ నివారించి ఉండవచ్చును. త్రుప్పు పడుతున్న పాత పైప్ లైన్ల నుండి గ్యాస్ లీకవుతోందని స్థానిక ప్రజలు ఎంత మోర పెట్టుకొన్నప్పటికీ అది చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే అయింది. వారి నిర్లక్ష్యానికి పదిహేను నిండు ప్రాణాలు గాలిలో కాలిపోయాయి. వారిలో ఇంకా ప్రపంచం గురించి తెలియని అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలు కూడా ఉన్నారు. ఎందరో తీవ్ర గాయాలపాలయ్యారు. సామన్య ప్రజల ఆస్తులు బుగ్గి పాలయ్యాయి.

 

ఇటువంటి నేరాలు ఉద్దేశ్యపూర్వకంగా చేసిన హత్యలతో సమానంగా పరిగణించి, సంబంధిత సంస్థ అధికారులను కటినంగా శిక్షించాలి. వారి నిర్లక్ష్యం కారణంగానే ఇటువని ఘోర దుర్ఘటన జరిగింది గనుక ప్రభుత్వం వారి నుండే ముక్కు పిండి నష్టపరిహారం కూడా వసూలు చేయాలి. అవసరమయితే అందుకోసం ప్రభుత్వం కొత్త చట్టాలు చేయాలి. న్యాయస్థానాలు , మానవ హక్కుల కమీషన్ వంటి సంస్థలు కూడా ఇటువంటి దుర్ఘటనలలో సంబంధిత వ్యక్తులు, సంస్తలపై సుమోటోగా కేసులు నమోదు చేసి దోషులను కటినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలి. ఇటువంటి ప్రమాదాలు, దుర్ఘటనలు, అత్యాచారాలు, నేరాలు జరిగిన ప్రతీసారి ప్రభుత్వాలు కమిటీలు వేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసినప్పుడు న్యాయస్థానాలు ప్రభుత్వాలకు మొట్టికాయలు వేసి ఎప్పటికప్పుడు దారిలో పెడుతున్డాలి. అప్పుడే ఇటువంటి దుర్ఘటనలు నివారించబడతాయి. లేకుంటే షరా మామూలుగానే మళ్ళీ ప్రమాదాలు, నేతల దిగ్భ్రాంతి, సానుభూతులు, పరామర్శలు కొనసాగిపోతూనే ఉంటాయి.