గద్దె దంపతులు గరం గరం?

 

విజయవాడ ఎంపీ సీటు.. కనీసం విజయవాడ తూర్పు ఎమ్మెల్యే సీటు పై కూడా కచ్చితమైన హామీ ఏదీ అధిష్ఠానం నుంచి రాకపోవడంతో గద్దె దంపతులు గరంగరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో సీనియర్ నాయకుడైన గద్దె రామ్మోహన్ భార్య అనూరాధను జడ్పీ చైర్మన్ గా బరిలోకి దించిన విషయం తెలిసిందే. అయితే, రామ్మోహన్ టికెట్ సంగతి మాత్రం ఇంతవరకు తేలలేదు. ఆయనకు విజయవాడ తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ కేటాయింపు విషయం కూడా నిర్ధారణ కాలేదు. ఇదే విషయమై అధినేత చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించినా, అపాయింట్ మెంట్ దొరకలేదని సమాచారం. దీంతో పార్టీ జిల్లా వ్యవహారాల పరిశీలకుడు సుజనా చౌదరితో గద్దె దంపతులు భేటీ అయ్యారు. తూర్పు నియోజకవర్గ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యలమంచిలి రవి టీడీపీలో చేరడంతో తమ సంగతి ఏంటని ఆయనను ప్రశ్నించారు.

 

అయితే ఆయన్ని బేషరతుగా మాత్రమే పార్టీలో చేర్చుకుంటున్నామని, ఎమ్మెల్యే సీటు హామీ ఏమీ ఇవ్వలేదని, అందువల్ల కంగారుపడాల్సిన పనిచేదని సుజనా చౌదరి చెప్పినట్లు సమాచారం. ఈ నెల 25లోగా తన భర్తకు తూర్పు నియోజకవర్గం సీటు ఇచ్చే విషయం తేల్చకపోతే ఆరోజు జెడ్పీ చైర్మన్ పోటీ నుంచి తప్పుకొంటానని అనూరాధ పార్టీకి అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది. ఈ నెల 25 వరకు ఏదోవిధంగా నాన్చివేత ధోరణి చూపి, ఆ తర్వాత తన భర్తకు మొండిచెయ్యి చూపితే.. తాను ఏమాత్రం సహించబోనని, తొలి నుంచి తన భర్త సీటుకే తాము ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె సుజనాచౌదరి వద్ద తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు పార్టీ నేతలు ఆలోచనలో పడినట్లు తెలిసింది.