గబ్బర్‌సింగ్ ట్రీట్‌మెంట్ రుచి చూస్తున్న పోసాని
Published on: Tue Mar 4, 2025 11:28AM

సినీ ఇండస్ట్రీలో కామెడీ క్యారెక్టర్ ఇమేజ్‌తో అంతో ఇంతో డిమాండ్ ఉన్న టైమ్‌లో వైసీపీలోకి వచ్చి .. అటు సినీ అవకాశాలు తగ్గిపోయి, ఇటు పొలిటికల్‌గా ఏం సాధించలేక, సెల్ఫ్ గోల్ చేసుకున్నారు వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి. ఇండస్ట్రీలో డిమాండ్ తగ్గిపోయినా ఇప్పుడు ఆయనకు ఇంకో రకంగా డిమాండ్ పెరిగిపోతోంది . రాజంపేట సబ్‌జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఇంకా ఆయనపై వస్తున్న ఫిర్యాదులకు అయితే లెక్కే లేదు. కేసులు నమోదైన పోలీసు స్టేషన్లకు సంబంధించిన పోలీసులు కూడా పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు.
ప్రస్తుతం 3 జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం రూరల్ పోలీసులు రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు అందించారు. మేం కోర్టు అనుమతి తీసుకున్నాం, ముందుగా మాకే పోసానిని అప్పగించాలి అని నరసరావుపేట పోలీసులు రాజంపేట జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోసానిని విచారించడానికి పల్నాడు జిల్లాకు షిఫ్ట్ చేశారు. అక్కడ విచారణ అనంతరం నరసరావుపేట కోర్టులో హాజరు పరచడంతో ఆయనకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దాంతో ఆయన్ని నరసరావుపేట సబ్‌జైలుకు తరలించారు. అయితే పోసానిని విచారించాలని వివిధ జిల్లాల పోలీసులు పీటీ వారెంట్లతో జైళ్లకు క్యూ కడుతున్నారు. దాంతో ఎప్పుడు ఏ జిల్లా పోలీసుల కస్టడీకి పోసానిని అప్పగిస్తారనేది సస్పెన్స్‌గా మారింది. ఈ వ్యవహారం అంతా చూస్తూ మొత్తానికి పోసానికి ఇప్పుడు ఇలా డిమాండ్ పెరిగిపోతోందన్న సెటైర్లు తెగ వినిపిస్తున్నాయి.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళీ ఏ రేంజ్ లో చెలరేగిపోయారో వేరే చెప్పనక్కర్లేదు. జనసేనాని పవన్‌కళ్యాణ్‌తో పాటు ఆయన ఫ్యామిలీని ఒక రేంజ్ లో టార్గెట్ చేశారు. సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులతో పాపులర్ అయిన పోసాని, పాలిటిక్స్‌లో డైరెక్ట్‌గా బూతు ప్రయోగాలతో అసహ్యకరమైన ట్రెండ్‌కు తెర లేపారు. తన నోటి దూకుడుతో పవన్, ఆయన భార్య పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. తనకు కూడా పెళ్లాం బిడ్డలు ఉన్నారన్న విషయం మర్చిపోయినట్లు జుగుప్సాకరమైన భాషతో పవన్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఆఖరికి రాజకీయాల నుంచి రిటైర్ అయి పద్దతిగా తన సినిమాలు తాను చేసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవిని కూడా పోసాని వదలి పెట్టలేదు. పీఆర్పీతో వ్యాపారం చేశారని, కాపులకు వెన్నుపోటు పొడిచారని అవాకులు, చెవాకులు పేలారు.
వైసీపీ అధికారంలో వుండడంతో అప్పట్లో జనసైనికులు పోసానిపై ఎన్ని కేసులు పెట్టినా పోలీసులు యాక్షన్ తీసుకోలేదు . కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జనసేన నాయకులు మళ్లీ ఫిర్యాదు చేయడంతో కడప జిల్లా పోలీసులు గంటల వ్యవధిలోనే హైదరాబాద్‌కు వెళ్లి పోసానిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు . వైసీపీ గద్దె దిగాక కూడా కొంత కాలం పోసాని తన నోటికి పని చెప్తూనే వచ్చారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ముఖ్యమంత్రిపై తన స్టైల్లో నోరు పారేసుకున్నారు. ఇంత జరిగాక రెండు నెలల క్రితం మీడియా ముందుకొచ్చి, తనకు జ్ఞానోదయం అయిందని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, ఇకపై తనకు రాజకీయాలకు సంబంధంలేదని ప్రకటించి సెంటిమెంట్ పండించాలని చూశారు.
టీడీపీ , జనసేన నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు పోసాని క్షమాపణలు కూడా కోరారు. మంత్రి నారా లోకేష్‌కి తన పట్ల సాఫ్ట్ కార్నర్ ఉందని, పార్టీలోకి కూడా ఆహ్వానించారనే విషయాన్ని పోసాని గతంలోనే వెల్లడించారు. ఆ క్రమంలో పోసాని క్షమాపణలు కోరడంతో, ఆయన ఆరోగ్య రీత్యా కేసుల విషయంలో నారా లోకేష్ వెయిట్ అండ్ సీ పాలసీ అవలంబిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఓవర్ నైట్ పోసాని ఏపీ పోలీసులకు బుక్ అయ్యారు. ఈ సడన్ ట్విస్ట్ వెనుక డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పట్టుదలే కారణమంట. తన తల్లి, ఫ్యామిలీ మెంబర్స్‌పై పోసాని కామెంట్స్ చేయడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న పవన్, ఆయన వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారంట.
దానికి తగ్గట్లే పోసానిపై జనసైనికులు వరుసగా కేసులు పెట్టారు.. ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.. పవన్ కల్యాణ్, ఆయన కుటుంబసభ్యులపై చేసిన కామెంట్స్‌ను అటాచ్ చేస్తూ జనసేనికులు పోసానిపై కంప్లైంట్లు గుప్పిస్తున్నారు.. పోసానిని అరెస్ట్ చేసిన కడప జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసు కావచ్చు, పీటీ వారెంట్‌తో నరసరావుపేట పోలీసులు ఆయన్ని విచారణకు తీసుకెళ్లిన కేసు ఇవన్నీ పవన్‌పై పోసాని చేసిన కామెంట్స్‌కు సంబంధించినవే కావడం గమనార్హం.
ఎవరైనా పవన్‌కల్యాణ్‌పై విమర్శలు చేస్తే, జైలు కెళ్లక తప్పదని జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించడం పవన్ పట్టుదలకు నిదర్శనంగా చెబుతున్నారు. పవన్‌కల్యాణ్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని, అలా మాట్లాడినందుకే ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడని ఆయన పరోక్షంగా పోసాని విషయాన్ని గుర్తు చేశారు.. నాదెండ్ల పవన్‌పై ఎవరైనా ఏమైనా మాట్లాడితే, పోసానికి పట్టిన గతే పడుతుందని ఇన్‌డైరెక్ట్‌గా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను భవిష్యత్తు చెప్పేశారు నాదెండ్ల. మొత్తమ్మీద పోసాని కేసులు చక్రబంధంలో చిక్కుకుపోయారు.. చేసుకున్నోడికి చేసుకున్నంత... అన్నట్లు జగన్ మెప్పు కోసం బూతు పురాణాలు వినిపించిన పోసానికి తగిన శాస్తే జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.. మరిక పీటీ వారెంట్ల ఎఫెక్ట్‌తో పోసాని ఇంకెన్ని జిల్లాల పోలీసు స్టేషన్ల మెట్లు ఎక్కుతారో చూడాలి.


