తెలంగాణా ఉద్యమ భవిష్యత్తుకు పరీక్ష కాబోతున్న పరకాల
Published on: Thu May 24, 2012 1:48PM
తెలంగాణాలోని 118 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క పరకాలలో మాత్రమే త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పరకాల ఉప ఎన్నికలు తెలంగాణలో ఉన్న పార్టీలన్నింటికీ ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ స్థానంలో గెలుపుకోసం అన్ని పార్టీలు తమ శక్తులను ఒడ్డేందుకు సిద్ధపడ్డాయి. దీనికి తోడు తెలంగాణా వాదానికి ఈ ఉప ఎన్నిక ఓ పరీక్షగా నిలువనుంది. ఈ ఒక్క వాదంపైనే ఆధారపడి బిజెపి, టి.ఆర్.ఎస్., వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ప్రధానంగా పోటీ పడుతున్నాయి. బిజెపి అభ్యర్థిగా డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి, టి.ఆర్.ఎస్. అభ్యర్థిగా భిక్షపతి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పోటీలో ఉన్నారు.
ఈ ముగ్గురిలో ముందునుంచి ప్రచారంలో ఉన్నది మాత్రం తాజామాజీ కొండా సురేఖ ఒక్కరే. తెలంగాణా కోసమే తాను రాజీనామా చేశానని కొండా సురేఖ చెప్పుకొస్తున్నారు. అదంతా కాదు తాము తొలుత జాతేయస్థాయిలో తీర్మానం చేశాం కాబట్టి తమను కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణా ఇచ్చేస్తామని భారతీయజనతాపార్టీ ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పలురకాల ప్రణాళికలతో ప్రచార కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. తమ నాయకురాలు సుష్మాస్వరాజ్ ను, ప్రకాష్ జవదేవ్ కర్. స్మృతి ఇరానీ ద్వారా నియోజకవర్గంలో ప్రచారం చేయించాలని నిర్ణయించుకున్నారు. మరో పాలమూరులా ఇక్కడా విజయం సాధిస్తామని ధీమాను వ్యక్తం చేస్తోంది.
అలానే తమ అభ్యర్థి భిక్షపతి భారీ మెజార్టీతో గెలుస్తారని టి.ఆర్.ఎస్. నేతలు ఆశిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున చల్లా ధర్మారెడ్డి పోటీలో ఉన్నారు. ఈయన తరపున తెలుగుదేశం తెలంగాణానేతలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సాంబారి సమ్మారావు విషయానికి వస్తే ఆయన తరుపున సిఎం. పీసీసీ చీఫ్ బోత్సా,, ఇంకా స్థానిక మంత్రులు, నేతలు ఒకటే హడావుడిగా ప్రచారం చేస్తున్నారు. వీరందరి కృషి ఫలితంగా తాను గెలుపొందే అవకాశాలున్నాయని సమ్మారావు ధీమా వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గం ఫలితాలు తెలంగాణా ఉద్యమం భవిష్యత్తుపై ప్రభావితం చూపే అవకాశం ఉండి. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే టి.ఆర్.ఎస్. కూడా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.


