రైలు బడి..బీజేపీ పొరబడి?

స్కూల్ కి కాలినడకన వెళ్లొచ్చు,బస్సు లో వెళ్లొచ్చు అదే స్కూల్ ట్రైన్ లో ఉంటే? స్కూల్ ఏంటి ట్రైన్ లో ఉండటమేంటి అనుకుంటున్నారా? కేటీఆర్ సొంత జిల్లా సిరిసిల్లలోని ఒక ప్రభుత్వ పాఠశాల గదులను రైలు బోగీల మాదిరిగా తీర్చిదిద్దారు.దీనిపై ఆయన ఈ రోజు ట్విట్టర్ లో ‘‘నా జిల్లా సిరిసిల్లలో ప్రభుత్వ పాఠశాలల తరగతి గదులను రీమోడల్ చేశాం. మీ అందరికీ నచ్చుతాయని భావిస్తున్నాను. ఇదంతా సీఎస్ఆర్ నిధుల సహాయంతో జరిగింది’’ అని ట్వీట్ చేశారు.ఇంతవరకు బాగానే ఉంది కానీ కేటీఆర్ పెట్టిన ట్వీట్‌ను అర్థం చేసుకోవడంలో జరిగిన పొరపాటు రాష్ట్ర బీజేపీని నవ్వులపాలు చేసింది.

 

 

సీఎస్ఆర్‌ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులను ఎస్‌సీఆర్ (సౌత్ సెంట్రల్ రైల్వే) నిధులుగా పొరబడి ,తెలంగాణా బీజేపీ ట్విటర్ ఖాతాలో ‘‘సిరిసిల్లా జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో... దక్షిణ మధ్య రైల్వే నిధులతో... ఆధునీకరించిన ప్రభుత్వ పాఠశాల దృశ్యాలు... ’’ అని ట్వీట్ చేశారు.అయితే దీని గమనించిన కేటీఆర్ ‘‘మీకు అద్భుతమైన హాస్య చతురత ఉంది బాబూ! లోకంలో ఉన్న ప్రతిదాన్నీ మీ ఘనతగానే చెప్పుకోవాలనుకుంటున్నారు!! అవి సీఎస్ఆర్ నిధులు, ప్రైవేటు పరిశ్రమల నుంచి వచ్చినవి (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ), అంతేకానీ ఎస్‌సీఆర్ (సౌత్ సెంట్రల్ రైల్వే) నిధులు కాదు’’ అని చురుక్కుమనేలా హాస్యాన్ని పండిస్తూ ట్వీట్ చేసారు.తమ పొరపాటు వలన జరిగిన తప్పిదాన్ని గ్రహించిన తెలంగాణ బీజేపీ ప్రజల ముందు నవ్వులపాలు కాకూడదని ట్విట్టర్ నుండి ట్వీట్ ని తొలగించింది.