TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అశోక్‌బాబుపై ఏంటా కేసు? గ‌తంలో ఏం జ‌రిగింది? ఇప్పుడేం జ‌రుగుతోంది?

Published on: Fri Feb 11, 2022 4:04PM

ఎమ్మెల్సీ అశోక్‌బాబును అర్థ‌రాత్రి అరెస్ట్ చేశారు ఏపీ సీఐడీ పోలీసులు. ఓ పాత కేసు.. అటూఇటీ తిరిగి.. ఇప్పుడు అరెస్ట్ వ‌ర‌కూ వ‌చ్చింది. ఓవైపు పీఆర్సీ ర‌చ్చ జ‌రుగుతుండ‌గా.. మాజీ ఏపీఎన్జీవో నేతైన అశోశ్‌బాబు అరెస్ట్ కావ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇది టీడీపీ నేత‌ల‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌నా? ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వార్నింగా? అనే చ‌ర్చ కూడా న‌డుస్తోంది. ప్ర‌భుత్వ ఉద్యోగులంద‌రికీ ఏదో ఒక మైన‌స్ ఉండే ఉంటుంది.. తోక‌జాడిస్తే.. కేసు పెట్టి లోప‌లేస్తామ‌ని హెచ్చ‌రించేందుకే ఇలా చేశార‌నే ఆరోప‌ణ కూడా ఉంది. టీడీపీ మాత్రం ఇదంతా కుట్ర అని.. క‌క్ష సాధింపు చ‌ర్యేన‌ని ఆందోళ‌న చేస్తోంది. ఇంత‌కీ అశోక్‌బాబుపై ఉన్న ఆ కేసు ఏంటి? గ‌తంలో క్లీన్‌చిట్ ఇవ్వ‌గా.. ఇప్పుడు అరెస్ట్ వ‌ర‌కూ ఎందుకు దారితీసింది..?

అశోక్‌బాబు వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పని చేసి రిటైర్‌ అయ్యారు. ఉద్యోగంలో ఉన్న‌ప్పుడు ఏపీఎన్జీవో అధ్య‌క్షుడిగా స‌మైక్యాంధ్ర కోసం గ‌ట్టిగా పోరాడారు. అప్ప‌ట్లో ఆయ‌న నాన్‌పొలిటిక‌ల్ హీరో. ఉద్యోగులంద‌రినీ ఒక్క‌తాటిపైకి తీసుకొచ్చి.. రాష్ట్ర విభ‌జ‌న‌కు వ్య‌తిరేకంగా బ‌ల‌మైన వాయిస్ వినిపించారు. అందుకే, అశోశ్‌బాబు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అంద‌రికీ తెలుసు. రాష్ట్రం విడిపోయాక న‌వ్యాంధ్ర‌లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేశాక‌.. టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ అయ్యారు. ఆయ‌న‌పై మిస్ట‌ర్ క్లీన్ ఇమేజే ఉంది. అయినా, ఓ కేసులో ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. ఇంత‌కీ అశోక్‌బాబుపై ఉన్న ఆ కేసు ఏంటంటే...

పదోన్నతి కోసం నకిలీ విద్యార్హతలను చూపించారనేది ఆరోప‌ణ‌. డిగ్రీ చదవకుండానే చదివినట్లుగా చూపించారని ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్ప‌టి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే శాఖాపరమైన విచారణ జరిగింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని అశోక్‌బాబు ఆనాడే వివరణ ఇచ్చారు. దీనిపై విజిలెన్స్‌ అధికారులు కూడా విచారణ జరిపి.. ఆయనపై అభియోగాలను ఉపసంహరించారు. అప్ప‌టి ఏపీ ముఖ్య‌మంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలోనే ఆ కేసు ‘క్లోజ్‌’ అయ్యింది. 

తాజాగా.. పీఆర్సీపై రగడ రగులుతున్న సమయంలోనే అశోక్‌బాబుపై వైసీపీ ప్రభుత్వం మరోమారు పాత ఆరోపణలను బయటికి తీసింది. అశోక్‌బాబుపై లోకాయుక్త‌కు మెహ‌ర్‌కుమార్ అనే వ్య‌క్తి ఫిర్యాదు చేశారు.  తమకు అందిన ఫిర్యాదు మేరకు.. విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐడీని లోకాయుక్త ఆదేశించింది. సీఐడీ వెంటనే కేసు నమోదు చేసింది. అందులో భాగంగా గురువారం అర్థ‌రాత్రి అశోక్‌బాబును అదుపులోకి తీసుకొని..అరెస్ట్ చేశారు. 

అయితే.. ప్రభుత్వ వ్యూహంలో భాగంగానే తనపై లోకాయుక్తకు కొత్తగా ఫిర్యాదు చేయించినట్టు అశోక్‌బాబు గ‌తంలోనూ ఆరోపించారు. చంద్ర‌బాబు సైతం అదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల పక్షాన పోరాడటం ఎమ్మెల్సీ అశోక్‌బాబు చేసిన తప్పా? అని టీడీపీ అధినేత నిల‌దీశారు. క్విడ్‌ప్రోకోలో భాగంగానే అశోక్‌బాబుపై విజ‌య‌వాడ‌కు చెందిన మెహర్ కుమార్‌తో తప్పుడు ఫిర్యాదు చేయించార‌ని ఆరోపించారు. ఆ మెహ‌ర్ కుమార్ భార్యకు బ్రాహ్మణ కార్పొరేషన్‌లో నామినేటెడ్‌ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌లోనూ అశోక్‌బాబు తన విద్యార్హత ఇంటర్‌ అని పేర్కొన్నారని స్ప‌ష్టం చేశారు. టైపింగ్‌ పొరపాటు వల్ల జరిగిన అంశంపై ఇంత కక్ష సాధింపా? అని చంద్రబాబు మండిప‌డ్డారు.