రష్యాను శిక్షించేందుకు 'స్విప్ట్’?.. SWIFT గురించి ఫుల్ డిటైల్స్..
Published on: Sat Feb 26, 2022 10:28AM
ఉక్రెయిన్‌పై దుందుడుకుగా యుద్ధం చేస్తున్న రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా, బ్రిటన్, ఐరోపా సమాజం (ఈయూ)లోని దేశాలు కీలకమైన మంతనాలు జరుపుతున్నాయి. ఇప్పటికే రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. అవి ఆశించిన ఫలితం రావడానికి కొంత సమయం పడుతుంది కనుక ఈ లోపే రష్యాను ఆర్థికంగా దెబ్బతీసి శిక్షించాలని యోచిస్తున్న ఆ దేశాలకు 'స్విఫ్ట్’ ఒక పదునైన ఆయుధంలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 'స్విఫ్ట్' అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది? ప్రపంచ విపణిలో దాని ఆవశ్యకత చర్చనీయాంశం అయింది.
ప్రపంచవ్యాప్త బ్యాంకుల ఆర్థిక సమాచార సంఘం (సొసైటీ ఫర్ వరల్డ్వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్)కు సంక్షిప్త రూపమే స్విఫ్ట్ (SWIFT). బెల్జియం ప్రధాన కేంద్రంగా పనిచేసే కన్సార్షియం ఇది. అంతర్జాతీయంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య కీలక సమాచారాన్ని, సందేశాలను వేగంగా, సురక్షితంగా చేరవేస్తుంది. వీటి ద్వారా స్విఫ్ట్ వ్యవస్థతో అనుసంధానమైన బ్యాంకులు తమ మధ్య భారీ చెల్లింపులను ఎలాంటి సందేహాలు లేకుండా జరుపుకొంటాయి.
'స్విఫ్ట్' వ్యవస్థ 1970లో రూపుదిద్దుకుంది. కొన్ని వేల సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. సభ్యులకు సేవలు అందించడమే దీని లక్ష్యం. సహకార విధానంలో కొనసాగుతోంది. స్విఫ్ట్ వ్యవస్థ ద్వారా ప్రస్తుతం సగటున రోజుకు 4.20 కోట్ల సందేశాలు వెళ్తున్నాయి. 2020లో రోజువారీ సగటు 3.80 కోట్లు. అత్యంత విశ్వసనీయ వ్యవస్థ కనుకే నిత్యం లక్షల కోట్ల రూపాయల విలువైన లావాదేవీలకు స్విఫ్ట్ కేంద్ర బిందువుగా మారింది.
స్విఫ్ట్ వ్యవస్థ నుంచి రష్యాను తొలగించాలని ఉక్రెయిన్, బ్రిటన్ దేశాలు కోరుతున్నాయి. అయితే, ఈయూలోని పలు దేశాలు సహనం పాటించాలని సూచిస్తున్నాయి. రష్యాపై విధించే నిషేధం అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుందని, దీనివల్ల ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడులకు గురవుతాయని డచ్ ప్రధాన మంత్రి మార్క్ రూత్ అంటున్నారు. రష్యాను స్విఫ్ట్ నుంచి తక్షణమే బహిష్కరించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జీ7 దేశాల సమావేశంలో ఒత్తిడి తెచ్చారు. అయితే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అందుకు సుముఖంగా లేరట. స్విఫ్ట్ నుంచి బహిష్కరణ చివరి అస్త్రంగానే ఉండాలంటున్నారు జో బైడెన్.
స్విఫ్ట్ నిషేధం ద్వారా ఆర్థిక సేవల సమాచారం పొందకుండా చేయగలమని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి దూరం చేయలేమని ఒబామా ప్రభుత్వంలో సేవలందించిన న్యాయవాది స్మిత్ తెలిపారు. దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్యాభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. అమెరికా డాలర్ స్థానంలో ప్రత్యామ్నాయ కరెన్సీ ఆధారంగా ప్రత్యర్థులు సమాచార వ్యవస్థను రూపొందించుకుంటారని హెచ్చరించారు.
గతంలో కొన్ని దేశాలపై నిషేధం విధించేందుకు స్విఫ్ట్ తిరస్కరించింది. తటస్థమైన వ్యవస్థగా తనను తాను అభివర్ణించుకుంది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆర్థిక సంస్థలతో తెగదెంపులు చేసుకొనే నిర్ణయాన్ని తీసుకోబోమని స్పష్టం చేసింది.
రష్యా బ్యాంకులను స్విఫ్ట్ నిషేధిస్తే.. అవి ప్రపంచ మార్కెట్లతో అనుసంధానాన్ని కోల్పోతాయి. రష్యన్లు, వారి కంపెనీలు దిగుమతులకు నగదు చెల్లింపులను సకాలంలో చేయలేవు. ఎగుమతులకు రావాల్సిన సొమ్మును అందుకోలేవు. రుణాలు పొందలేవు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టలేవు. అప్పుడు రష్యా బ్యాంకులు తమ చెల్లింపుల కోసం ఫోన్లపై, లఘుసందేశాల యాప్ లపై, ఈమెయిల్స్ వంటి ప్రత్యామ్నాయాలపై ఆధారపడక తప్పదు. తమపై ఆంక్షలు విధించని దేశాలతో ఈ విధానాల్లోనే లావాదేవీలు కొనసాగించాల్సి వస్తుంది. నిర్వహణ వ్యయం అధికమవుతుంది.
బెల్జియం, ఈయూ నిబంధనలకు లోబడి స్విఫ్ట్ పనిచేస్తుంది. ఇరాన్ అణు కార్యక్రమం నేపథ్యంలో 2012లో ఆ దేశానికి చెందిన సంస్థలు, కేంద్ర బ్యాంకుతో పాటు ఇతర ఆర్థిక సంస్థలు స్విఫ్ట్ సేవల్ని వినియోగించుకోకుండా ఈయూ దేశాలు నిషేధం విధించాయి. స్విఫ్ట్ సేవల నుంచి రష్యా బ్యాంకులను దూరం పెడితే ఆ దేశానికి సరకులను ఎగుమతి చేసే వారు తమకు రావాల్సిన నగదు పొందటానికి కష్టపడాల్సి వస్తుంది. రష్యా ప్రధాన ఎగుమతులైన చమురు, సహజవాయువులను పొందే దేశాలకూ ఇబ్బందులు తప్పవు.


