మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు 

కరోనా కష్టకాలంలో విడుదలైన "పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల" బొమ్మ మూడు వారాలు పూర్తిచేసుకొని అర్థశత దినోత్సవం వైపు పరుగులు తీసేలా ఉంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 20వ రోజు కూడా పెరిగాయి. పెట్రోలుపై లీటర్‌కు 21 పైసలు, డీజిల్‌పై 17 పైసలు పెరిగాయి. పెరిగిన ధరల అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకి రూ.80.13 గా ఉండగా, డీజిల్ ధర రూ.80.19  గా ఉంది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.83 ఉంటే, లీటర్ డీజిల్ ధర రూ.80 గా ఉంది. 

కరోనాతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ప్రజలపై  పెట్రోల్, డీజిల్ ధరల భారం కూడా అధికమవుతోంది. వరసగా 20 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా, దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడంపై విపక్షాలు మండిపడుతున్నాయి.