పంద్రాగస్టు వేడుకలకు ఐదువేలమందే...

ప్రతి ఏడాది అంతరంగవైభవంగా ఢిల్లీలో నిర్వహించే భారత స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకుని గతంలో క‌న్నా భిన్నంగా  అతి తక్కువ మందితో ఈ వేడుకలను నిర్వహిస్తారు. వచ్చే శనివారం ఆగ‌స్టు 15న జరగనున్న 74న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ముస్తాబు అవుతోంది. ఈ మేరకు మునుపెన్నడూ లేని విధంగా కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఢిల్లీ అధికారులు సన్నాహాలు  చేస్తున్నారు. ఎర్రకోటలో ప్రధానమంత్రి జెండా ఎగురవేసే కార్యక్రమం ఉదయం 9 గంటలకు జరుగుతుందని, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆయా జిల్లాల్లోనూ అదే సమయానికి వేడుకలు నిర్వహించాలని హోం శాఖ పేర్కొంది.

ఆరోగ్య భద్రత, దేశ భద్రత కారణాలతో తనిఖీలు ముమ్మరం చేస్తూ అతి తక్కువ సంఖ్యలో అతిథులను ఆహ్వానిస్తున్నారు.  కరోనా వారియర్స్ గా ముందువరుసలో నిలబడిన  డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులతో పాటు కరోనా నుంచి కోలుకున్నవారిని స్వాతంత్య్ర దినోత్స‌వ‌ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆహ్వానాలు పంపించారు. అతిథుల సంఖ్య ఐదువేలకు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

వేడుకల్లో పాల్గొన్నే సైనిక, పోలీసు బలగాలు మాస్కులు ధరించి మార్చ్ ఫాస్ట్ లో పాల్గొంటారని, రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో జరిగే కవాతుల్లోనూ మాస్కుల వాడకం, ఫిజికల్ డిస్టెన్స్ నియమాలను తప్పనిసరిగా ఫాలో కావాలని సూచించారు.

ప్రతి సారి వేలాది మంది స్కూల్ విద్యార్థులతో నిర్వహించే పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సారి ఉండవు. ఐదు వందల మంది ఎన్ సీసీ క్యాడెట్లు మాత్రమే హజరవుతారు.

మాస్క్ తప్పనిసరిగా ధరించేలా అవగాహన కల్పిస్తూ భౌతిక దూరం పాటించేలా సీటింగ్ అరెంజ్ మెంట్స్ చేస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్నే వారందరికీ తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు చూసే సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తులు వేడుకలు జరిగే ప్రాంతంలోకి రావద్దని సూచిస్తున్నారు. ఈ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌వుతున్న సిబ్బంది మాస్కులు ధ‌రించి విధులు నిర్వ‌హిస్తున్నారు.