రాఫెల్ డీల్.. మరో ట్విస్ట్..!!

ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలాండ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘రాఫెల్‌ ఒప్పందంలో అనిల్‌ అంబానీ కంపెనీని భాగస్వామిని చేయాలని ప్రతిపాదించింది భారత ప్రభుత్వమే’నని అన్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. ఈ విషయంపై ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పించాయి.. తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా రాఫెల్ డీల్ టాపిక్ రచ్చ అయింది.. అయితే ఇంతలోనే ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఒక ట్విస్ట్ ఇచ్చింది.. వార్తలను ఖండించింది.. ఒప్పందాల్లో భారత సంస్థలను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఫ్రాన్స్‌ కంపెనీలకు ఉంటుందని స్పష్టం చేసింది.

 

 

'భారత ప్రభుత్వం ప్రతిపాదించిందని మేం కంపెనీలను భాగస్వాములుగా ఎంచుకోం.. రాఫెల్‌ ఒప్పందంలో మా పాత్ర కూడా ఏం లేదు.. ఒప్పందాల కోసం సంస్థలను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఫ్రాన్స్‌ కంపెనీలకు ఉంటుంది.. ఏ సంస్థకు సామర్థ్యం ఉందని భావిస్తే వాటినే మా కంపెనీలు ఎంచుకుంటాయి.. అప్పుడు భారత ప్రభుత్వ అనుమతిని కోరుతాయి’ అని ఫ్రాన్స్‌ ప్రభుత్వం వెల్లడించింది. 

మరోవైపు ఈ వార్తలను డస్సాల్ట్  ఏవియేషన్‌ కూడా ఖండిస్తోంది.. రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా ఎంచుకోవడం పూర్తిగా తమ నిర్ణయమేనని చెబుతోంది.. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా ఈ ఒప్పందం చేసుకున్నాం.. రాఫెల్‌ ఒప్పందం కోసం మేం రిలయన్స్‌ను ఎంచుకున్నాం.. ఇది మా నిర్ణయమే.. మా నిర్ణయంతోనే మేం కొనసాగుతాం అని డసో ఏవియేషన్‌ సీఈవో ఎరిక్‌ ట్రాపియర్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.. ఇదంతా చూస్తుంటే రాఫెల్ గందరగోళం ఇప్పటిలో తేలేలా లేదు.. ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలాండ్‌ నిజంగానే ఇంటర్వ్యూలో అలా అన్నారా? లేక మీడియా అత్యుత్సాహం చూపిందా? తెలియాల్సి ఉంది.. చూద్దాం ఇంకా ముందు ముందు రాఫెల్ డీల్ గోల ఎటువైపు వెళ్తుందో.