ఆధార్.. భద్రం బి కేర్ ఫుల్ బ్రదర్.
Published on: Mon Jul 30, 2018 1:42PM
ఆధార్ లింక్ అంటూ.. అన్నింటికీ ఆధార్ ని ఆధారం చేసింది ప్రభుత్వం.. ఈ ఆధార్ లింక్ వల్ల వ్యక్తిగత డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉందని ఎందరు చెప్తున్నా ప్రభుత్వం మాత్రం తోసిపుచ్చింది.. కానీ తాజా సంఘటనలు చూస్తే ఆధార్ తో వ్యక్తిగత డేటా లీక్ అనే మాట నిజమే అనిపిస్తుంది.. ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తన ఆధార్ నంబర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎవరైనా సరే తన వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయండంటూ సవాల్ విసిరారు.

ఈ సవాల్ స్వీకరించిన హకెర్స్ ఆర్ ఎస్ శర్మకు చెందిన ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ, అడ్రస్, పుట్టిన తేదీ, పాన్ నంబర్, ఓటర్ ఐడీ నంబర్, టెలికాం ఆపరేటర్, ఫోన్ మోడల్, ఎయిర్ ఇండియాలో ఆయన ప్రయాణ వివరాలు వంటివి బయట పెట్టారు.. అయితే ఇవన్నీ నెట్‌లో అందుబాటులో ఉన్నవే కదా అంటూ కొందరు మళ్ళీ హాకర్స్‌ను సవాలు చేశారు.. దీంతో ఆర్ఎస్ శర్మ ఆధార్‌తో లింక్ అయిన పే టీఎం, భీమ్ వంటి యాప్స్‌తో పాటు ఐఎంపీఎస్ ద్వారా ఒక రూపాయి పంపించి, ఆ వివరాల స్క్రీన్ షాట్స్‌ను కూడా పెట్టారు.. అలానే శర్మకు చెందిన డీమ్యాట్ అకౌంట్ ఖాతాలతో పాటు ఓ మత సంస్థకు ఎస్‌బీఐ కార్డు ద్వారా ఆయన మూడేళ్ళ సబ్‌స్ర్కిప్షన్ చెల్లించిన వివరాలు కూడా సంపాదించారు.. దీంతో అందరూ షాక్ అయ్యారు.. మరోవైపు ఈ హకెర్స్ లోని ఎలియట్ అండర్సన్ అనే వ్యక్తి పీఎం మోడీకి సవాల్ విసిరారు.. మోడీ మీ ఆధార్ నంబర్ చెప్పండి, మీ వ్యక్తిగత వివరాలు బయటపెట్టి చూపిస్తాం అంటూ సవాల్ విసిరారు.. అయితే ఇవన్నీ తాము ఆధార్‌లో ఉన్న లోపాలను బయటపెట్టేందుకు చేసినవేనని, వీటి వెనుక ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని హాకర్స్ స్పష్టం చేశారు.


